YSR Congress party : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని భావిస్తోందా? అవసరమైతే స్థానిక ప్రతినిధులనుశిబిరానికి తరలించాలని చూస్తోందా? అందుకు బెంగళూరు అయితే సేఫ్ జోన్ అని డిసైడ్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో టిడిపి కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటినుంచి వైసీపీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. స్థానిక సంస్థల్లో వైసిపికి స్పష్టమైన బలం ఉంది. కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న జగన్.. బలమైన అభ్యర్థిగా భావించి బొత్స సత్యనారాయణను రంగంలోకి దించారు. ఆర్థికంగా బలమైన నేత కావడం, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండడంతో.. ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే స్థాయి సంఘ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి జగన్ అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవైపు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతూనే.. పోలింగ్ వరకు వారికి సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.వైసిపికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను బెంగళూరు క్యాంపునకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే టిడిపి కూటమి సైతం బలమైన అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన సైతం బలమైన నేత కావడంతో.. నియోజకవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
*అప్పట్లో ఏకగ్రీవంగా
గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఎనిమిది వందల పైచిలుకు స్థానిక సంస్థల ఓట్లకు గాను.. 600 మందికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. టిడిపి కూటమికి కేవలం 200 మంది ప్రతినిధుల బలం మాత్రమే ఉంది. దీంతో అప్పట్లో విపక్షం పోటీ కూడా పెట్టలేదు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన జనసేనలోకి ఫిరాయించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
* వైసీపీలో భయం
ఈ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖను దాదాపు కూటమి ప్రభుత్వం వైట్ వాష్ చేసింది. కేవలం అరకు, పాడేరులో మాత్రమే వైసిపి విజయం సాధించింది. అందుకే ఆ పార్టీలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. మొన్నటి వరకు విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ కొనసాగింది. ఆ పార్టీకి చెందిన నేత మేయర్ గా ఉన్నారు. కానీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మరికొందరు టిడిపి పాటు పట్టారు. ఎన్నికల తరువాత కూడా కొద్దిమంది కార్పొరేటర్లు తప్ప.. మిగతావారు గోడ దూకేందుకు సిద్ధపడ్డారు. అయితే చేరికల విషయంలోకొన్ని రకాల నిబంధనలతో ముందుకెళ్లాలని కూటమి నిర్ణయించింది. కానీ స్థాయి సంఘ ఎన్నికల్లో దెబ్బతీయాలంటే.. చేరికలను ప్రోత్సహించాలని భావించింది. పెద్ద ఎత్తున చేర్చుకొని వైసీపీకి దెబ్బతీసింది.
* జగన్ సరికొత్త వ్యూహం
ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. కచ్చితంగా స్థానిక సంస్థల ప్రతినిధులను తన వైపు తిప్పుకుంటుంది. అందుకే జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. ఈనెల 30 పోలింగ్ జరిగే వరకు బెంగళూరులో శిబిరాన్ని కొనసాగించడానికి డిసైడ్ అయ్యారు. అయితే శిబిరం నిర్వహించడం అంటే సామాన్యం కాదు. భారీ ఎత్తున తాయిలాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్నింటికి సిద్ధపడే వైసిపి ఎన్నికల బరిలో దిగుతుండడంతో.. ఖర్చుకు కూడా వెనుకడుగు వేయరని తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp doing camp politics for mlc of visakha local bodies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com