YS Jagan : పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుందా? జగన్మోహన్ రెడ్డి పై వేటు పడనుందా? అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే సస్పెన్షన్ వేటు పడటం ఖాయమా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నిబంధనల మేరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే సంఖ్యాబలంతో పని ఏముందని.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేదు. దీంతో ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శాసనసభకు వచ్చారు జగన్. తరువాత అసెంబ్లీకి హాజరు కావడం మానేశారు. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వార్షిక బడ్జెట్ సైతం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ సమావేశాలకు రాకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పై వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పడం విశేషం.
* ఆ నిబంధన చూపిస్తున్న డిప్యూటీ స్పీకర్
వరుసగా అనుమతి లేకుండా 60 రోజులపాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందన్న నిబంధనను చూపించారు రఘురామకృష్ణం రాజు. అయితే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతలు గైర్హాజరు అవడం ఇప్పుడు కొత్త కాదు. 2014 నుంచి 2019 మధ్య కొద్దిరోజుల పాటు మాత్రమే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారు. కానీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ అసెంబ్లీకి బాయ్ కట్ చేశారు. వైసీపీ సభ్యులు ఎవరు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. 2019 నుంచి 2024 వరకు మధ్యలో చంద్రబాబు సైతం శాసనసభను బహిష్కరించారు. 2021 సెప్టెంబర్ లో కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మూడు సంవత్సరాల పాటు అసలు శాసనసభ వైపు చూడలేదు. అయితే అప్పట్లో వారెవరిపై చర్యలు తీసుకోలేదు. సస్పెన్షన్ వేటు పడలేదు.
* గెలుపు సాధ్యమేనా?
ఒకవేళ రఘురామకృష్ణంరాజు భావిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి పై వేటుపడి పులివెందులకు ఉప ఎన్నిక జరిగితే.. టిడిపి అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా తీసుకుంటారా? పులివెందుల ప్రజలు ఆయనను వద్దనుకుంటారా? అంటే మాత్రం దీనికి సమాధానం లేదు. దశాబ్దాలుగా పులివెందులలో తన పట్టును నిలుపుకుంది వైయస్సార్ కుటుంబం. పెట్టని కోటగా మార్చుకుంది. కూటమి ప్రభంజనంలో ఈసారి అక్కడ మెజారిటీ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అంతమాత్రాన అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని కాదు. ఆయనను ఓడిస్తారని కాదు. రఘురామకృష్ణం రాజు రాజకీయ వ్యూహంలో భాగంగా అలా మాట్లాడవచ్చు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చి.. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వైసీపీకి ఏ స్థాయిలో ఇది బూస్ట్ ఇస్తుందో తెలియంది కాదు. అదే సమయంలో వైసీపీ ఓడిపోతే.. ఆ పార్టీ ఉనికికే ప్రమాదం. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతారు. అదే సమయంలో అధికార పార్టీ తన దర్పాన్ని చూపిస్తుంది. తప్పకుండా అధికార దుర్వినియోగం జరుగుతుంది. అంత చేసి మరి జగన్మోహన్ రెడ్డి పై గెలుపు సాధ్యమా అంటే? అది డౌటే. అందుకే ఈ సస్పెన్షన్ వేటు.. పులివెందులకు ఉప ఎన్నిక వంటివి మాటలకే కానీ చేతల వరకు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* అంత ఈజీ కాదు
ఒక్క మాట చెప్పాలంటే పులివెందుల విషయంలో కానీ.. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పై సస్పెన్షన్ వేటు విషయంలో కానీ.. కూటమి ఈజీగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డిని అంత తక్కువ అంచనా వేయకూడదు కూడా. ఎందుకంటే ఒకవేళ పులివెందులకు ఉప ఎన్నిక రావాలని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. మొత్తం వ్యవస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. అటువంటి సమయంలోనే కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల నుంచి తల్లి విజయమ్మ రికార్డు స్థాయి మెజారిటీని సొంతం చేసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అనుకుంటే తప్ప పులివెందులకు ప్రస్తుతం ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది కూటమికే ప్రమాదం. అక్కడ గెలుపు జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది.