CM Jagan: విశాఖ నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం జగన్ తరచు విశాఖ నగరానికి వస్తుండడంతో సాగర నగర వాసులకు నరకయాతన తప్పడం లేదు. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు బుధవారం సీఎం జగన్ వస్తున్నారు. ఈ సందర్భంగా అధికారుల ఏర్పాట్లు నగరవాసులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా మహిళలను 10 కిలోమీటర్ల మేర నిలిపి స్వాగతం ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. వారం రోజుల కిందట నగరంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు జరిగాయి. కానీ ఆరోజు జన సమీకరణ లేకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి జగన్ వస్తుండడంతో ప్రజలకు ఇబ్బంది పెట్టేలా అధికారులు ఏర్పాటు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
సీఎం జగన్ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కానీ దానికి సైతం జన సమీకరణ చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు రావడం విశేషం. ఎక్కడ.. ఎంత జన సమీకరణ చేయాలి అన్నదానిపై ఒక పట్టిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 11:20 నిమిషాలకు సీఎం జగన్ విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శారదాపీఠం వరకు పది కిలోమీటర్ల మేర దాదాపు 24 ప్రాంతాల్లో మహిళలను రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి స్వాగతం పలికించాలని నిర్ణయించారు. ఏ కూడలిలో ఎంతమందిని నిలబెట్టాలని వివరాలతో ఏకంగా ఒక పట్టిక రూపొందించారు. అక్కడకు డ్వాక్రా మహిళలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎండలు ముదురుతున్నాయి. విశాఖ నగరంలో తీవ్రంగా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. అటువంటిది మిట్ట మధ్యాహ్నం రోడ్డుపై మహిళలను నిలబెట్టడం భాగ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ బుధవారం హాజరవుతుండగా.. మంగళవారం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం విశేషం. మంగళవారం రాత్రి ట్రయల్ రన్ వేశారు. దీంతో ఎన్ఏడి కూడలి, గోపాలపట్నం, విమానాశ్రయం కూడలి, కాకాని నగర్ కూడలిలో ట్రాఫిక్ ను నిలిపివేశారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. గత ఏడాది శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు సీఎం జగన్ వస్తున్నారని చెప్పి.. రోడ్డు డివైడర్ పై ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించారు. కానీ అప్పట్లో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. ఈ ఏడాది సైతం అదే తరహా ఇబ్బందులు ఎదురు కావడం విశేషం.