Visakhapatnam Glass Bridge: విశాఖలో( Visakhapatnam) మరో ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. విశాఖ అంటేనే పర్యాటక నగరం. చూడముచ్చటగా ఉంటుంది ప్రతి ప్రాంతం. అందుకే ఇక్కడ ఎటువంటి పర్యాటక ప్రాజెక్ట్ అయిన సక్సెస్ కావడం ఖాయం. తాజాగా కైలాసగిరి పై గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకంగా మంచి గుర్తింపు సాధిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కైలాసగిరి పై ఎన్నెన్నో పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే అంతకంటే ముందే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడం విశేషం. దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జి ఇది అని తెలుస్తోంది. కైలాసగిరి పై పర్యాటకులను ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి విశాఖ అందాలను చూడవచ్చు. తీరప్రాంత సొగసులను వీక్షించవచ్చు.
ఆధునిక టెక్నాలజీతో..
అత్యాధునిక టెక్నాలజీతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. 40 ఎం ఎం మందం కలిగిన లామినేటెడ్ గాజును ఈ బ్రిడ్జి నిర్మాణంలో వినియోగించారు. జర్మనీ నుంచి ప్రత్యేకంగా ఈ గాజులు తెప్పించారు. 500 టన్నుల బరువు మోయగలదు ఈ బ్రిడ్జ్. 250 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచినా తట్టుకోగలదు. ఒకేసారి 40 మంది ఈ బ్రిడ్జిపై నిల్చొని విశాఖ నగరంతో పాటు తీరాన్ని వీక్షించవచ్చు. దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జి ఇది. గతంలో కేరళలో అతిపెద్ద బ్రిడ్జి ఉండేది. అయితే దాని కంటే పెద్దది ఇప్పుడు విశాఖలో ఏర్పాటు అయింది. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ పర్యాటక మణిహారంలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకంగా నిలవనుంది. మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. డబుల్ డెక్కర్ బస్సులు సైతం అందుబాటులోకి వచ్చాయి. వాటిలో నగరంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు.
పర్యాటకానికి ప్రాధాన్యం..
సాధారణంగా తెలుగుదేశం( Telugu Desam) ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా పర్యాటక రంగానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. పర్యాటకపరంగా ఉమ్మడి రాష్ట్రంలోనూ విశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఎందుకంటే సువిశాలమైన తీరంతో పాటు మనోహరమైన మన్య ప్రాంతం ఉండేది. ఒకవైపు విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతాలతో పాటు అరకు ప్రాంతం సైతం ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. విశాఖ అంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పక్కనే ఉన్న ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రజలు సైతం ఎంతగానో ఇష్టపడతారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో అందుబాటులోకి రావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించడం సైతం ఒక ప్రత్యేకత.