YS Jagan : కాంగ్రెస్ ఏకైక ఆప్షన్.. చంద్రబాబే అడ్డంకి.. డిఫెన్స్ లో జగన్!

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే పర్వాలేదు. విపక్షంలో ఉంటే మాత్రం జాతీయస్థాయిలో అండ అవసరం. ఏదో కూటమిలో చేరడం అనివార్యం.అయితే ఈ విషయంలో జగన్ డిఫెన్స్ లో ఉన్నారు.

Written By: Dharma, Updated On : July 27, 2024 11:19 am
Follow us on

YS jagan : దేశంలో చాలావరకు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల నుంచి పుట్టుకొచ్చినవే.కొన్ని మాత్రం తమ రాష్ట్ర ప్రయోజనాలు, ఆశలు,ఆశయాలు,ఆకాంక్షలకు అనుగుణంగా ఆవిర్భవించాయి. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరడం అనివార్యం. తమ రాష్ట్రంలో ప్రత్యర్థి ఒక కూటమిలో ఉంటే.. దానికి వ్యతిరేక కూటమిలో సర్దుబాటు కాక తప్పదు. అయితే ఇప్పుడు జగన్ ఏ కూటమి వైపు ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. కూటమిలో అతిపెద్ద పార్టీ కూడా అదే.అయితే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు దాదాపు.. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చినవే. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి మమతా బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు. చిన్న పార్టీగా మార్చేశారు. మహారాష్ట్రలో అయితే సోనియా గాంధీ నాయకత్వాన్ని ఎదిరించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు శరద్ పవర్. ఎన్సీపీని స్థాపించి ఇప్పటివరకు ఉనికి చాటుకుంటూ వస్తున్నారు. అయితే అటు మమతా బెనర్జీ, ఇటు శరద్ పవర్ ఇద్దరూ కాంగ్రెస్ కూటమిలోకి రావడం విశేషం. అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా గుర్తించాలి. ఇప్పుడు జగన్ అలా చేస్తారా? చేయరా? అసలు కాంగ్రెస్ జగన్ ను కలుపుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.అయితే ఏపీ విషయంలో జరుగుతున్న పరిణామాలతో జగన్ కాంగ్రెస్ తో కలుస్తారా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది. వచ్చే ఎన్నికల నాటికి క్లారిటీ రానుంది.

* దూరమైన ఆ వర్గాలు
గత ఐదు సంవత్సరాలుగా బిజెపితో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు జగన్. ఆ పార్టీతో నేరుగా కలవలేదు కానీ.. కలిసి పని చేసినంత పని చేశారు. పరస్పర రాజకీయ ప్రయోజనాలు పొందారు. ఇదే వైసీపీని దెబ్బతీసింది. ముస్లిం మైనారిటీ తో పాటు వెనుకబడిన వర్గాలు వైసీపీ నుంచి చేజారాయి. 2014లో ఆ వర్గాలు అండగా నిలిచాయి. 2019లో అయితే సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. కేవలం బిజెపితో అంటగాకినందుకే జగన్ కు ఈ దారుణ ఓటమి. అది కాంగ్రెస్ పార్టీతో వెళితే మాత్రం.. ఆ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంటుంది. వేగంగా ఆ రెండు పార్టీల మధ్య సర్దుబాటు తో పాటు ఓట్ల బదలాయింపు కూడా జరుగుతుంది.

* జగన్, రాహుల్ మధ్య అంత ఈజీ కాదు
జగన్ కు రాహుల్ గాంధీతో సయోధ్య కుదరడం అంత ఈజీ కాదు. 2009లో సునాయాసంగానే ప్రధానమంత్రి పదవి దక్కింది రాహుల్ కు. కానీ నాటి పరిస్థితులతో ప్రధాని పదవికి దూరంగా ఉండిపోయారు రాహుల్. గత పదిహేళ్లుగా ప్రధాని కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే తన నాయకత్వాన్ని సైతం పటిష్టం చేసుకున్నారు. 2014, 2019 తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీని బలీయమైన శక్తిగా మార్చుకోగలిగారు.జగన్ సైతం అదే మాదిరిగా ఎదిగారు. కానీ అంతే స్థాయిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా ఎదగడం కూడా కష్టం. రాహుల్ తో పాటు జగన్ కు కూడా ఈగో ఎక్కువ. ఆ ఇద్దరి మనస్తత్వాలు కలవడం చాలా కష్టం.

* జగన్ కు క్లిష్ట సమయం
చంద్రబాబుకు ఇప్పుడు ఆప్షన్ ఉంది. జగన్ కు మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆప్షన్. వైసీపీని బలహీనం చేస్తే కానీ.. ఏపీలో ఎదగడం సాధ్యం కాదని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు బిజెపితో ఉంటారని కూడా చెప్పలేం. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి బలహీనపడితే చంద్రబాబు మనసు కాంగ్రెస్ వైపు మల్లే అవకాశం ఉంది. జగన్ సైతం ఇదే అనుమానంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో ఇప్పటికీ చంద్రబాబు టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తద్వారా ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి ఉన్న అడ్డంకులను స్వయంగా చూపించారు. మొత్తానికి అయితే జగన్ ప్రయాణం పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదు.