Vangaveeti Radha : వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు అలా వాడుకోనున్నారా?

వంగవీటి మోహన్ రంగ.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఆయనకు చంద్రబాబు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 2, 2024 8:15 pm

Vangaveeti Radha

Follow us on

Vangaveeti Radha :వంగవీటి మోహన్ రంగ రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చారు రాధాకృష్ణ. కానీ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. అందుకే సుదీర్ఘకాలం పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. అయితే గత అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని రాజకీయాలు చేశారు. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపునకు కృషి చేశారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా టిడిపిలోనే కొనసాగారు. ఇప్పుడు అదే రాధాకృష్ణ గుర్తింపునకు కారణమైంది. ఆయనకు త్వరలో పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు రాధాకృష్ణకు తగు రీతిలో గౌరవిస్తారని.. ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం నడిచింది. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును టిడిపి హై కమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత టిడిపి అభ్యర్థిగా మాజీమంత్రి ఆలపాటి రాజాను ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. అయితే వైసిపి ఈ సీటు విషయంలో ప్రతిష్టాత్మకంగా ఉండడంతో.. వంగవీటి రాధా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసిపి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దాని నుంచి బయట పడాలంటే సరైన విజయం దక్కాలని భావిస్తోంది. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన వైయస్ కుటుంబానికి సమీప బంధువు. ఆపై బలమైన ఆర్థిక నేపథ్యం ఉంది. ఆయనను ఢీకొట్టాలంటే వంగవీటి రాధాకృష్ణ అయితే సరైన అభ్యర్థి అవుతారని టాక్ నడుస్తోంది.

* గౌతమ్ రెడ్డితో విభేదాలు
వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడడానికి గౌతమ్ రెడ్డి ఒక కారణం. విజయవాడ రాజకీయాల్లో గౌతంరెడ్డి దూకుడుగా ఉంటారు. కార్మిక సంఘాల్లో మంచి పట్టు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాధాకృష్ణ జగన్ వెంట నడిచారు. అయితే గౌతమ్ రెడ్డి విజయవాడ రాజకీయాల్లో ఎంటర్ అయ్యేసరికి సీన్ మారింది. గౌతం రెడ్డికి రాధాకృష్ణతో విభేదాలు ఎదురయ్యాయి. అవే వంగవీటి మోహన్ రంగ పై గౌతమ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు కారణమయ్యాయి. అయితే అప్పట్లో కనీసం గౌతమ్ రెడ్డిని మందలించలేదు జగన్. అది రాధాకృష్ణకు నచ్చలేదు. పైగా నచ్చిన సీటు నుంచి తప్పించడంతో రాధాకృష్ణ టిడిపి వైపు వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే గౌతంరెడ్డి వల్లనే రాధాకృష్ణ పార్టీ మారారు. ఇప్పుడు అదే గౌతమ్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మారడంతో.. వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రయోగిస్తారని ప్రచారం నడుస్తోంది.

* చిన్న వయసులో అసెంబ్లీకి
2004లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు రాధాకృష్ణ. తండ్రి మోహన్ రంగ మరణం సమయానికి ఆయన బాలుడు. అయితే 2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో రాధాకృష్ణను చూసి రాజకీయాల్లోకి ఆహ్వానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు రాధాకృష్ణ. అయితే 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జగన్ పిలుపుమేరకు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ రూపంలో రాధాకృష్ణకు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రాధాకృష్ణ పొలిటికల్ లైఫ్ టర్న్ అయ్యే ఉందన్నమాట.