https://oktelugu.com/

Caste Politics in AP : ఏపీలో కుల రాజకీయాలు పార్టీలను గెలిపిస్తాయా?

ఇప్పుడు వైసీపీ కూడా అదే పనిచేస్తోంది. కాపులు పవన్ వైపు వెళ్లడంతో ముద్రగడను వైసీపీలో తేవాలని చూస్తోంది. కాపులను టర్న్ చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే గత అనుభవాలను తీసుకుంటే మాత్రం సక్సెస్ శాతం అంతంతమాత్రమనే చెప్పాలి. 

Written By:
  • Dharma
  • , Updated On : June 15, 2023 / 03:13 PM IST
    Follow us on

    Caste Politics in AP : కులాలు వేరు.. కుల రాజకీయాలు వేరు. దశాబ్దాలుగా కుల రాజకీయాలు చేసిన నాయకులు సక్సెస్ అయ్యారా? అంటే సమాధానం లేదు. కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగిన నాయకులకు కొదువ లేదు. నేతల మనుగడకు అక్కరకు వస్తున్న కులాలు..తమ కులం వెనుకబాటుతనం రూపుమాపేందుకు మాత్రం పనికిరావడం లేదు. కులం పేరిట రాజకీయాలు నడుపుతూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. పదవులు సంపాదిస్తున్నారు. కులంపై పట్టు సాధించే క్రమంలో రాజకీయ పార్టీలు కుల నాయకులను చేరదీస్తున్నాయి. అలాగని ఆ కులమంతా వారి వెంట నడుస్తుందా? అంటే అదీ లేదు. కులపరంగా ఆ నేతపై అభిమానం చాటుతునే.. తమకు నచ్చిన పార్టీలకు ఓట్లు వేసేవారే అధికం.

    మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నాయకుడిగా మంద కృష్ణమాదిగ అందరికీ సుపరితం. ఆయన పోరాటానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొత్తం మాదిగ కులం ఆయన్ను ఇష్టపడుతుంది. అభిమానిస్తుంది. కులాన్ని శాసిస్తూ వస్తున్న ఆయన రాజకీయ పిలుపులకు సక్సెస్ రేటు అంతంతమాత్రమే. గతంలో చాలా పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ ఆయన మాట మన్నించిన వారు మాదిగల్లో కొంతమందే. గతంలో కాంగ్రెస్ ఓటమికి  కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

    గత ఎన్నికల్లో జూపూడి ప్రభాకరరావు, కారెం శివాజీ, డొక్కా మాణిక్య వరప్రసాదరావు లాంటి కుల నాయకులు టీడీపీలో ఉన్నారు. టీడీపీతోనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీకి ఓటేయ్యాలని ఊరూ వాడా ప్రచారం చేశారు. వారి మాటలు విన్న సామాజికవర్గ ఓటర్లు ఓటు వేశారంటే అస్సలు లేదు. వారిపై అభిమానం ఉన్నా అది వేరని.. రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అటువంటి నేతలు ఎన్నికల తరువాత తమ సామాజికవర్గం వారి ఆకాంక్ష అంటూ వైసీపీలో చేరారు.

    కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నేత ముద్రగడ పెద్దపోరాటమే చేశారు. ఆయనకు అన్ని పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారు. అప్పట్లో టీడీపీ నేతలు తప్ప… వైసీపీ, బీజేపీ, జనసేన కాపు శ్రేణులు సైతం సంఘీభావం ప్రకటించాయి. అలాగని ముద్రగడ వైసీపీని గెలిపించమని పిలుపునివ్వలేదు. కానీ నాడు టీడీపీ కాపుల వ్యతిరేకి అని చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అది పరోక్షంగా వైసీపీకి లాభించింది. కానీ కుల నాయకుల రాజకీయ పిలుపులకు మాత్రం కులం స్పందించిన దాఖలాలు చాలా తక్కువఅనే చెప్పాలి. ఇప్పుడు వైసీపీ కూడా అదే పనిచేస్తోంది. కాపులు పవన్ వైపు వెళ్లడంతో ముద్రగడను వైసీపీలో తేవాలని చూస్తోంది. కాపులను టర్న్ చేయాలని ప్రయత్నిస్తోంది. అయితే గత అనుభవాలను తీసుకుంటే మాత్రం సక్సెస్ శాతం అంతంతమాత్రమనే చెప్పాలి.