Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పై( Jogi Ramesh) పట్టు బిగిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. నిన్ననే కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. పూర్తి ఆధారాలతో సహా అన్ని వివరాలను పొందుపరిచింది. గతంలో వ్యాపార భాగస్వామిగా నకిలీ మద్యం ప్రధాన నిందితుడు ఉన్నాడు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బంధం కొనసాగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై బురద జల్లేందుకు కూడా అదే ప్రధాన నిందితుడి పై ఆధారపడ్డారు జోగి రమేష్. పదేళ్ల కిందట వ్యాపార భాగస్వామిగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం తయారీదారులుగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కుట్ర కోణానికి ప్రధాన నిందితుడిని జోగి రమేష్ వాడుకున్నారు అన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. అదే విషయాన్ని చార్జ్ షీట్లో స్పష్టం చేసింది సిట్. అంటే జోగి రమేష్ తప్పించుకునేందుకు వీలులేని స్థితిలో పట్టు బిగిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం.
చిత్తూరు జిల్లా( Chittoor district) తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం డంప్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ హల్చల్ చేశారు. అయితే తంబళ్లపల్లెలో నకిలీ మద్యం డంప్ నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు గా తేలింది. అయితే అదే జనార్దన్ రావు జోగి రమేష్ కు సన్నిహితుడిగా పేరుంది. తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం బయటకు తీశారు పోలీసులు. ఇంతలో విదేశాల నుంచి ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వస్తుండగా ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అయితే గతంలో జోగి రమేష్ తో చేసిన వ్యాపారాలు, మద్యం వ్యాపారాలు, నకిలీ మద్యం దందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర వంటివి బయటపెట్టారు. జోగి రమేష్ తమను నమ్మించి మోసం చేయడం వల్లే ఈ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీంతో కుట్ర కోణంలో దర్యాప్తు చేసిన సిట్.. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు రిమాండ్ లోనే ఉన్నారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team). నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు ఆయన సోదరుడి నుంచి జోగి రమేష్ కు ఎప్పటికప్పుడు ముడుపులు అందేవని.. అందుకు సంబంధించి వారి మధ్య సంభాషణ, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి స్క్రీన్ షాట్లు వంటి వాటిని చార్జ్ షీట్లో పేర్కొంది ప్రత్యేక దర్యాప్తు బృందం. నకిలీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు తో జోగి రమేష్ కు చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయట. జనార్దన్ రావు ను వ్యాపార భాగస్వామిగా చేసుకుని చాలా రకాల కార్యకలాపాలు సాగించారట. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యం డంప్ చేసేవారట. అందుకుగాను లక్షలాది రూపాయల ముడుపులు జోగి రమేష్ సోదరులకు అందేవట.. వీటన్నింటినీ చార్జ్ షీట్లో పొందుపరుస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలనాలకు కారణం అయ్యింది. ఇప్పుడప్పుడే జోగి రమేష్ బయటపడే అవకాశమే లేదని స్పష్టం అవుతోంది.