Nandyala News: భర్తలపై భార్యల ఘాతుకాలు ఆగడం లేదు. పైగా ఈ నేరాలు రోజుకో తీరుగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అంతమొందించడాలు.. ఈ దారుణాల కోసం పకడ్బందీగా రూపొందించే ప్రణాళికలు క్రైం థ్రిల్లర్ సినిమాలను సైతం మించిపోతున్నాయి. అక్కడిదాకా ఎందుకు మేఘాలయ ఘటనపై అంతటి అమీర్ ఖాన్ సైతం హతాశుడయ్యాడని.. ఆ ఘటన నేపథ్యంగా ఏకంగా సినిమా తీస్తున్నాడని సమాచారం. ఇక ఈ విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో భర్తను చంపిన భార్య ఏకంగా దారుణానికి పాల్పడింది. అయితే ఈ ఘోరంలో సంచలన విషయం వెలుగు చూసింది.
Also Read: పరాయి వ్యక్తితో భార్య “ఏకాంత చర్చ”.. అడిగినందుకు భర్తకు ఈ శిక్ష
నంద్యాల ప్రాంతంలో భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘాతుకంలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూనెపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్యకు.. పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన రమణమ్మతో సరిగా 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో రమణయ్య, రమణమ్మ మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మొదట్లో పెద్ద మనుషులు పంచాయతీలు చేసి దంపతులిద్దరికీ సర్ది చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు వారిద్దరు కలిసి ఉన్నారు. మళ్లీ గొడవలు మొదలు కావడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. రమణమ్మ తన పుట్టింట్లో ఉంటోంది. అయితే భార్యను తన ఇంటికి తీసుకురావడానికి రమణయ్య వెళ్లాడు. ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఒకానొక దశలో ఆమె భర్తతో వెళ్లడానికి ప్రయత్నించింది. మధ్యలో ఆమె తరఫు కుటుంబ సభ్యులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ పెరిగింది. దీంతో రమణమ్మ కూడా తన మనసు మార్చుకుంది. అంతేకాదు భర్త మీద దాడికి దిగింది. రమణమ్మ తో పాటు, ఆమె తమ్ముడు రమణయ్య కళ్ళల్లో కారం చల్లాడు. దీంతో రమణయ్య ఒక్కసారిగా కిందపడిపోయాడు. కింద పడిపోయిన అతనిపై రమణమ్మ, కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో రమణయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
రమణయ్య మృదేహాన్ని ఒక సంచిలో వేసుకొని.. ప్రత్యేకమైన వాహనంలో రమణమ్మ, అతని కుటుంబ సభ్యులు నేరుగా నంద్యాలకు తీసుకొచ్చారు. నంద్యాల నుంచి నూనెపల్లి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రమణయ్య ఇంటి ముందు శవాన్ని పడేశారు. శవాన్ని పడడం మాత్రమే కాదు.. మా జోలికి వచ్చాడు.. కుక్క చావు చచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. అతని ఇంటిముందు శవాన్ని పడేయడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగ ప్రవేశం చేశారు. రమణయ్య ను చంపింది అతని భార్య, కుటుంబ సభ్యులు కాబట్టి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ నిర్వహిస్తున్నామని నంద్యాల పోలీసులు వెల్లడించారు.. గొడవలు మాత్రమే కాకుండా అంతకుమించిన కారణాలు ఉన్నాయని.. విచారణలో అవి బయటపడతాయని నంద్యాల పోలీసులు చెబుతున్నారు.. కొంతకాలంగా నంద్యాల ప్రాంతం ప్రశాంతంగా ఉంటోంది. గతంలో ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగేవి. ఇటీవల కాలంలో అవి పూర్తిగా సర్దుమణిగాయి. ఈక్రమంలో ఈ గొడవ జరగడం పోలీసులను దిగ్భ్రాంతి గురి చేస్తోంది. అయితే రమణమ్మ ఇంటి మీదికి రమణయ్య తరఫు బంధువులు వెళ్లకుండా పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బలగాలను రప్పించి పిడుగురాళ్ల ప్రాంతంలో రక్షణ కల్పిస్తున్నారు.