YS Jagan not visiting Tadepalli: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) తాడేపల్లి వైపు చూడడం మానేసారన్న విమర్శలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఆయన బెంగుళూరుకే పరిమితం అవుతున్నారు. పెద్దగా సన్నిహితులను సైతం అనుమతించడం లేదు బెంగళూరుకు. అక్కడే ఉండి ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుసగా రహస్య మంతనాలు కూడా జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఏపీలోని కీలక అధికారులు సైతం జగన్మోహన్ రెడ్డితో బెంగళూరులో సమావేశం అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వారం తాడేపల్లికి రాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. చివరకు పార్టీ తలపెట్టిన ఇఫ్తార్ విందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రావడం లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన ఇఫ్తార్ విందు అర్ధాంతరంగా వాయిదా పడింది.
పాత కేసులతో..
జగన్మోహన్ రెడ్డి రాజకీయ దూకుడు పెంచిన నేపథ్యంలోనే పాత కేసులు అన్ని యాక్టివ్ అయినట్లు ప్రచారంలో ఉంది. ఒకవైపు మద్యం కుంభకోణం( liquor Schame) కేసు బిగుసుకుంటోంది. కల్తీ నెయ్యి వ్యవహారం ఎలానూ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కూడా క్రియాశీలకంగా మారింది. చాలా లోతైన విచారణ సాగుతోంది. తనతో పాటు పార్టీ నేతలపై సైతం పట్టు బిగిస్తోందని జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఉన్నట్లు ఉంది. అందుకే కాస్త పార్టీ కార్యక్రమాలను పక్కనపెట్టి ఆయన ఈ కేసుల నుంచి విముక్తికి.. బెంగళూరు ప్యాలెస్ వేదికగా కీలక మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని.. అందుకే తాడేపల్లి వైపు చూడడం మానేసారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
షెడ్యూల్ అదే..
సాధారణంగా మంగళవారం( Tuesday) తాడేపల్లి వచ్చి.. బుధవారం రోజంతా సమావేశాలు జరిపి.. గురువారం వెళ్తూ వెళ్తూ మీడియా సమావేశం నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే ఈ వారం మంగళవారం వచ్చినా జగన్ జాడలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియని పరిస్థితి. దీంతో పార్టీ శ్రేణులు సైతం గందరగోళంలో పడ్డాయి. అయితే ఇప్పుడు పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లింలు ఉన్నారు. వారి పవిత్రమైన రంజాన్ మాసానికి సంబంధించి ఇఫ్తార్ విందుకు కూడా హాజరు కాకపోవడం ఏమిటనేది కొత్త చర్చ. కచ్చితంగా భవిష్యత్తు భయంతోనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు సమావేశాల గోప్యత, ఇఫ్తార్ విందు వాయిదా పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అనుమానాలను పెంచుతున్నాయి ఈ పరిణామాలు. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.