YSRCP political situation: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? ఆ పార్టీ గత వైభవం దిశగా అడుగులు వేసే పరిస్థితి ఉందా? 2029 ఎన్నికల్లో సత్తా చాటే పరిస్థితి ఉందా? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. కానీ అనతి కాలంలోనే అధికార టిడిపికి చుక్కలు చూపించింది. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందా? లేకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుందా? దీనిపై బలమైన చర్చ నడుస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికీ కేంద్రం వైఖరి మారింది. అదే తెలుగుదేశం కూటమికి ప్లస్సు అయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా పరిణమించింది.
నమ్మదగిన స్నేహితుడిగా టిడిపి..
2014లో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు బిజెపి వాజ్పేయి నేతృత్వంలో ఉండేది. ఆ తరువాత స్థానం లాల్ కృష్ణ అద్వానీ అలియాస్ ఎల్కే అద్వానీ ఉండేది. అప్పటికే చంద్రబాబు చతురత పనిచేసేది. మిగతా నేతలతో పోల్చుకుంటే చంద్రబాబు సీనియర్ కూడా. వయసు రీత్యా అటల్ బిహారీ వాజ్పేయి సీనియర్ కానీ.. క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి చంద్రబాబు అప్పటికే తనకు తాను నిరూపించుకున్నారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావును అధికారానికి దూరం చేసి తాను సొంతం చేసుకున్నారు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో గెలిచారు. అందుకే చంద్రబాబుకు వాజ్పేయి తో పాటు ఎల్కే అద్వానీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ 2014లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏకు దగ్గరయింది కానీ.. మునుపటి బిజెపి పెద్దల మాదిరిగా చంద్రబాబును నమ్మే స్థితి లేదు. దాని పర్యవసానం అనుభవించారు చంద్రబాబు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని 2024 ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి బిజెపిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. అలా మూడు పార్టీల కలయికతో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు.
బలమైన మిత్రుడిగా..
అయితే గత పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ను బలమైన మద్దతుదారుడుగా మార్చుకున్నారు చంద్రబాబు. తద్వారా భారతీయ జనతా పార్టీని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీకి ప్రజా వ్యతిరేకత అనేది సర్వసాధారణం. అదే సమయంలో మిత్రుల ద్వారా బలపడాలన్నది బిజెపి వ్యూహం. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో పరిమితంగా ఉంది మిత్రపక్షాల పాత్ర. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా పక్షం పెద్ద ప్రాంతీయ పార్టీలతో బలంగా ఉంది. అదే ఎన్డీఏ విషయంలో బిజెపి తర్వాత పెద్ద పార్టీగా టిడిపి ఉంది. అటు తరువాత నితీష్ నేతృత్వంలోని జెడియు, అకాలి దళ్, ఆపై దేవే గౌడ జెడిఎస్ ఉంది. అయితే ఉన్నంతలో తెలుగుదేశం పార్టీ సీనియర్. ఆపై చంద్రబాబు జాతీయస్థాయిలో మంచి నాయకుడు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.
క్రమేపి వైసిపి కి దూరంగా
అయితే బిజెపికి సిద్ధాంతపరంగా వ్యతిరేక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్. ఆ పార్టీ పరోక్ష మద్దతు కే తప్ప.. ప్రత్యక్షంగా ఇచ్చే మద్దతుకు ప్రజలు హర్షించరు. ఆ విషయం బిజెపికి తెలుసు. అందుకే ఆ పార్టీని దూరంగా పెడుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి. కానీ జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీతో మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది పొలిటికల్ గా చాలా డ్యామేజ్ చేస్తోంది. 2014లో బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ ఉంది. 2019లో ఏకపక్షంగా అధికారాన్ని సొంతం చేసుకుంది. 2024లో డిజాస్టర్ ఫలితాలను చవిచూసింది. అయినా సరే ఆ పార్టీ ఎందుకో ఇంకా బీజేపీ అంటూ జపం చేస్తోంది. అది ఎంత మాత్రం నష్టం తప్ప లాభం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.