CM Chandrababu :  జగన్ అవినీతిని చంద్రబాబు ఎందుకు తవ్వి తీయడం లేదు.. కేసులు ఎందుకు పెట్టడం లేదు?

అధికారపక్షం పాలకపక్షంపై కక్ష సాధింపునకు దిగడం రాజకీయాల్లో సర్వసాధారణం. గత రెండు దశాబ్దాలుగా ఈ సంస్కృతి ఏపీలో పెరిగింది. జగన్ హయాంలో చంద్రబాబును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలిసింది. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ఆ చాన్స్ వచ్చినా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : October 22, 2024 10:31 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu :  కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. మాజీ సీఎం జగన్ పై టార్గెట్ చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు.అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.ఇప్పటివరకు జగన్ పై ఒకే ఒక కేసు నమోదు అయింది.అది రఘురామకృష్ణం రాజు పెట్టిన కేసు. వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ ఆదేశాలతో తనపై సిఐడి కేసు నమోదు చేసిందని.. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసారన్నది రఘురామకృష్ణంరాజు ఆవేదన. సీఎం జగన్ ఆదేశాలతోనే అప్పట్లో సిఐడి అధికారులు అలా చేశారని ఆరోపిస్తూ రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుమించి జగన్ పై ఎటువంటి కేసు నమోదు కాలేదు. కానీ వైసీపీ మాత్రం హడావిడి చేస్తోంది. జగన్ పై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వారి నుంచి వినిపిస్తున్నాయి.కానీ ఒకటి మాత్రం నిజం.జగన్ పై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. కానీ ఆయన చుట్టూ ఉన్న వారిపై మాత్రం కేసులు నమోదు చేసి.. కూటమి ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది.

* ఎటువంటి ఆధారాలు లేకపోయినా
వైసీపీ హయాంలో చంద్రబాబుపై పెద్ద ఎత్తున అవినీతి కేసులు నమోదయ్యాయి. ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఏకంగా 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. ఆయనకు బెయిల్ దక్కకుండా పావులు కదిపింది అప్పటి జగన్ ప్రభుత్వం. ఒకవేళ ముందస్తు బెయిల్ లభించకపోయినా.. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆ కేసులు ఇప్పటికీ కొనసాగేవి. అయితే ఈ కేసుల్లో విచిత్రంగా అన్ని అవినీతికి సంబంధించినవే. ఒక్క అంగళ్లు కేసు మాత్రం శాంతి భద్రతలకు సంబంధించినది.చంద్రబాబు అవినీతినేరుగా ఎటువంటి ఆధారాలు చూపలేదు. కేవలం ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని చూపించి అరెస్టు చేశారు.సుదీర్ఘకాలం జైలులో ఉంచగలిగారు. అయితే ఇప్పుడు కూటమి జగన్ పై ఆ విధంగా చేసిందా? అంటే అటువంటిదేమీ కనిపించడం లేదు.

* ఆ భూముల వెనుక తతంగం
జగన్ పై అవినీతి కేసులకు చాలా రకాల అవకాశాలు ఉన్నాయి.తాజాగా విశాఖ శారదా పీఠం ఆస్తులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 2021 నవంబర్లో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించింది జగన్ సర్కార్. వైదిక్ యూనివర్సిటీ నిర్వహణకు గాను తనకు భూములు కావాలని అడిగిన స్వామి స్వరూపానంద కు.. 15 లక్షల రూపాయలకు 225 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కట్టబెట్టింది జగన్ సర్కార్.గత ఐదు సంవత్సరాలుగా స్వరూపానంద జగన్ కు రాజ గురువుగా ఉండేవారు. ఈ ఒక్క కేసు చాలు జగన్ ను ఇరికించడానికి. కానీ చంద్రబాబు సర్కారు ఎందుకో జగన్ విషయంలో వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం శారదా పీఠానికి కేటాయించిన భూములను వెనక్కి మాత్రమే తీసుకుంది. దీని వెనుక జరిగిన తప్పిదాలను తవ్వి బయటకు వెలుగు తీసే ప్రయత్నం చేయలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం అదే పనిగా జగన్ ను కూటమి టార్గెట్ చేస్తోందన్న ఆరోపణలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ విషయంలో.. జగన్ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించకపోవడం విశేషం.