Allu Arjun: ఏపీలో పొలిటికల్ హిట్ పతాక స్థాయికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ప్రచారపర్వం ముగియనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు చివరి ప్రయత్నం గా ప్రచారం చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిత్ర పరిశ్రమ మొత్తం ముందుకు వస్తోంది. ఇప్పటికే చిరంజీవితో పాటు కుర్ర హీరోలు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ ప్రచారం చేశారు. చిరంజీవి పిఠాపురం ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేశారు. మరోవైపు చివరి రోజు రాంచరణ్, ఆయన తల్లి సురేఖ పిఠాపురం వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలవాలని ఆకాంక్షించారు. సరిగ్గా ఈ సమయంలోనేమెగా హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు.వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.
నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో అల్లు అర్జున్ స్పందించారు.పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. ఆయన రాజకీయం ప్రయాణంలో గమ్యానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అయితే అది మరువక ముందే నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతు ప్రకటించారు. సతీ సమేతంగా నేరుగా నంద్యాల వెళ్లి రవి మనస్ఫూర్తిగా గెలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్, సినీ సర్కిల్స్లో చర్చకు దారి తీసింది.భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నంద్యాల వచ్చారు.గజమాలతో శిల్పా రవిచంద్ర రెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు.బన్నీ రేంజ్ రోవర్ కారులో దిగగా పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టారు. వేలాదిమంది అభిమానుల మధ్య శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటికి బన్నీ దంపతులు చేరుకున్నారు.
శిల్పా రవిచంద్ర రెడ్డి ఇంటి పైనుంచి అభిమానులకు అల్లు అర్జున్ దంపతులు అభివాదం చేశారు. అయితే బన్నీ భార్య స్నేహ రెడ్డికి శిల్పా రవిచంద్ర రెడ్డి దగ్గర బంధువు కావడంతోనే అల్లు అర్జున్ వచ్చారని ప్రచారం జరిగింది. కానీ శిల్పా రవిచంద్రారెడ్డి భార్య నాగిని రెడ్డి స్నేహ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అట. స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్న తర్వాత రవిచంద్ర రెడ్డి తో బన్నీకి కూడా స్నేహం కుదిరింది. శుభకార్యాలకు, మంచి చెడులకు ఇరు కుటుంబాల వారు రాకపోకలు సాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో స్నేహితుడు రవి చంద్రారెడ్డి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో.. శుభాకాంక్షలు చెప్పేందుకు నేరుగా హైదరాబాదు నుండి నంద్యాల రావడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించి.. ఇప్పుడు స్నేహితుడు కి నేరుగా వచ్చి శుభాకాంక్షలు తెలపడం పై మెగా అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. బన్నీ చర్యలను ఎక్కువమంది తప్పు పడుతున్నారు.