Homeఆంధ్రప్రదేశ్‌Jagan Congress Talks: కాంగ్రెస్ తో జగన్ రాజీ?

Jagan Congress Talks: కాంగ్రెస్ తో జగన్ రాజీ?

Jagan Congress Talks: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కాంగ్రెస్ పార్టీతో సయోధ్య కుదుర్చుకున్నారా? సరైన టైంలో ఇండియా కూటమిలో చేరుతానని చెప్పారా? తన పార్టీ ఎంపీని రాయభారానికి పంపించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో వైసీపీ ఎంపీ ఒకరు సమావేశం అయ్యారు. దీంతో సదరు ఎంపీ పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ ఆ వైసీపీ ఎంపీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన జగన్ ఆదేశాలతోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారని ఢిల్లీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవైపు బిజెపికి మద్దతు ఇస్తూనే.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రధాన ప్రచారం. ఇటీవల ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసిపి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసిపి ఎంపి కాంగ్రెస్ అధ్యక్షుడితో సమావేశం కావడం కొత్త చర్చకు దారితీసింది.

Also Read: జగన్ తో షర్మిల భేటీ?

బిజెపి పై అప నమ్మకం
ప్రస్తుతం బిజెపి( Bhartiya Janata Party ) తెలుగుదేశం పార్టీకి కీలక మిత్రపక్షం. ఆ రెండు పార్టీల బలం రోజురోజుకు బలపడుతోంది. 2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు పార్టీలు కలిసే వెళ్తాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. అయితే ఈ విషయంలో బిజెపి నుంచి కనీస స్థాయిలో భరోసా లభించడం లేదు. అయితే బిజెపి మరింతగా తన విషయంలో కఠినం అవుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు తప్పనిసరి. అందుకే బిజెపి అడిగిందే తరువాయి మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే కేవలం తనపై ఉన్న కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తలవంచాల్సి వస్తోంది.

ఖర్గేతో వైసీపీ ఎంపీ భేటీ
కాంగ్రెస్ పార్టీ( Congress Party) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బరిలో దించింది. ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. కానీ ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్డీఏకు మద్దతు తెలిపింది. ఒకవైపు ఇలా పరిణామాలు జరుగుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా మల్లికార్జున్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. దీంతో మేడా మల్లికార్జున్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం నడిచింది. అటువంటిదేమీ లేదని.. తాను ఖర్గేను మర్యాదపూర్వకంగానే కలిశానని ప్రకటించారు మల్లికార్జున్ రెడ్డి. దీంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. జగన్ కోసం రాయభారిగానే ఆయన ఖర్గేతో సమావేశం అయ్యారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోవడం ఇష్టం లేక.. తాను ఏ పరిస్థితుల్లో బిజెపికి మద్దతు తెలిపింది వివరించేందుకు మేడా మల్లికార్జున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పంపించారని ఊహాగానాలు వస్తున్నాయి.

Also Read: ఏపీలో ఎస్టీ జాబితాలోకి ఆ రెండు కులాలు?

భవిష్యత్ అవసరాల దృష్ట్యా..
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు( National democratic alliance) జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. కానీ జగన్ విషయంలో పాత కేసులు తెరపైకి రావు కానీ.. మిగతా రాజకీయ విషయాల్లో బిజెపి సహకరించే పరిస్థితి లేదు. అలాగని ఇతర రాజకీయ పక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. త్వరలో జగన్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే జాతీయస్థాయిలో తనకు మద్దతు తెలిపే పార్టీ లంటూ ఉండవు. పైగా రాహుల్ గాంధీ నాయకత్వానికి ఇప్పుడిప్పుడే ప్రజల మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కుదుర్చుకోవడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఎంపీ మేడ మల్లికార్జున్ రెడ్డిని ప్రయోగించారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version