PAC Chairman : ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసిపి హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో గైర్హాజరవుతూ వస్తోంది. ఇంకోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. అయితే ఈ తరుణంలో అసెంబ్లీలో పిఎసి చైర్మన్ పదవి భర్తీ చేయాల్సి వచ్చింది. దీంతో కూటమికి, వైసీపీకి మధ్య ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పదవికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు నామినేషన్ లకు సమయం ఉంది. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి పదవి దక్కదు. కానీ ప్రతిపక్షానికి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మండలిలో తమకు ఉన్న సంఖ్యాబలంతో పోటీ చేయాలని వైసిపి భావిస్తోంది. అనూహ్య నిర్ణయాలు జరిగితే మినహా ఈ పదవి వైసిపికి దక్కే అవకాశమే లేదు. దీంతో ఈ ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి ఈ పదవిని ప్రతిపక్షాలకి కేటాయిస్తారు. కానీ వైసీపీకి ఆ పదవి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. చైర్మన్ తో పాటు సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు మధ్యాహ్నం వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఇచ్చింది. ఈరోజు సింగిల్ నామినేషన్లు దాఖలు అయితే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. లేకుంటే మాత్రం రేపు ఓటింగ్ జరపనున్నారు.
* ఆనవాయితీని కొనసాగించరా?
175 అసెంబ్లీ సీట్లకు గాను.. కూటమికి 164 సీట్ల బలం ఉంది. వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. శాసనసభ చరిత్ర తీసుకుంటే గత ఆరు దశాబ్దాలుగా పిఎసి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతూ వస్తోంది. 2019లో టిడిపి కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. ఆ సమయంలో కూడా పీఏసీ చైర్మన్ గా టిడిపికి చెందిన పయ్యావుల కేశవ్ కు అవకాశం ఇచ్చింది వైసిపి ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏకంగా ఎన్నికలకు సిద్ధపడుతుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పీఏసీతోపాటు ఇతర కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానాన్ని సీఎం చంద్రబాబు తరఫున ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో, మండలిలో లోకేష్ ప్రవేశపెట్టారు.
* జనసేన కు ఛాన్స్
ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. టిడిపి తర్వాత జనసేన ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి సైతం ఎనిమిది అసెంబ్లీ సీట్లలో గెలుపొందింది. ఆ రెండు పార్టీలు టిడిపి కూటమిలో ఉన్నందున ప్రతిపక్షంగా తమకే పీఏసీ చైర్మన్ పదవి కావాలని వైసిపి కోరుకుంటుంది. అందుకే మండలిలో సంఖ్యాబలం బట్టి పోటీకి సిద్ధపడుతోంది. అయితే శాసనమండలి సభ్యుడికి పిఎసి చైర్మన్ గా ఛాన్స్ ఉంటుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేనకు పిఎసి చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ప్రతిపక్షానికి ఇప్పటివరకు ఆ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అన్నది చర్చకు దారితీస్తోంది.