Chandrababu : అమిత్ షా కాకుండా.. మోదీ సంకీర్ణ ప్రభుత్వంలో నంబర్ -2 ఎవరు?

ఇటీవల ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సింహభాగం దక్కింది. గత పది ఏళ్లల్లో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదు. అటు బీహార్ పరిస్థితి కూడా అంతే. దీంతో దేశ వ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలపై చర్చ జరుగుతోంది.. ఇదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 28, 2024 3:55 pm
Follow us on

Chandrababu :  “చదరంగం ఆటలో ఒంటెల్ని, గుర్రాల్ని, మంత్రులను దాటి రాజును వేసేస్తే ఆట ముగుస్తుంది. పావులు మళ్ళీ జోడిస్తే కొత్త ఆట మొదలవుతుంది. ఇక్కడ కిరీటాలు మాత్రమే శాశ్వతం. తలలు కాదు”.. చదరంగానికే కాదు ప్రస్తుత వర్తమాన రాజకీయాలకు కూడా పై మాటలు నూటికి నూరు పాళ్లు వర్తిస్తాయి. ఎందుకంటే రాజకీయాలలో పదవులు శాశ్వతంగా ఉంటాయి. కాకపోతే వాటిని అలంకరించే వ్యక్తులు మారిపోతుంటారు. 2014 నుంచి 2020 నాలుగు దాకా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాన్ని అమిత్ షా అలంకరించారు. అటు పార్టీలో, ఇటు కేంద్రంలో రెండవ స్థానంలో ఏకచత్రాధిపత్యంగా కొనసాగారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బిజెపి అనుకున్న విధంగా 400కు మించి సీట్లు రాలేదు. ఎప్పటికీ అండగా ఉంటున్న ఉత్తర ప్రదేశ్ అక్కున చేర్చుకోలేదు. మహారాష్ట్ర ధైర్యాన్ని ఇవ్వలేదు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక మాత్రమే ఆలంబన ఇచ్చాయి. ఫలితంగా మోదీ ఊహించని ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 272+ సీట్లు సాధించిన నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బిజెపికి 16 స్థానాలు సాధించిన చంద్రబాబు, బీహార్ లోని నితీష్ కుమార్ సహకారం కావాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.

ఇటీవల ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సింహభాగం దక్కింది. గత పది ఏళ్లల్లో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదు. అటు బీహార్ పరిస్థితి కూడా అంతే. దీంతో దేశ వ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలపై చర్చ జరుగుతోంది.. ఇదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. మునుపటి ఉత్సాహం ఆయనలో కనిపించడం లేదు. బహుశా మోదీ అనుకున్న సీట్లు రాకపోవడమే ఇందుకు కారణమని వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇదే దశలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. తన రాష్ట్రానికి కావలసిన పనులను మొత్తం ఆయన చక్క పెట్టుకుంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే సంస్కరణలు చేయాలని.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని తర్వాత అటు జాతీయ మీడియాలో చంద్రబాబు బాగా ఫోకస్ అయ్యారు.. ఆ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు..

ఇదే చంద్రబాబు అప్పట్లో వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు.. దేశ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా కనిపించారు. ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకోవడంతో.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ కూటమి నుంచి బయటికి వచ్చారు. మళ్లీ 2014లో ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆ తర్వాత నరేంద్ర మోడీకి ఆయనకు విభేదాలు వచ్చాయి. అనంతరం ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటికి వచ్చారు. మళ్లీ 2023 చివర్లో బిజెపి పెద్దలతో మంతనాలు జరిపి ఎన్డీఏ కూటమిలో చేరారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. ఏకంగా 16 పార్లమెంటు స్థానాలను దక్కించుకొని ఎన్ డి ఏ కూటమికి మద్దతు పలికారు. చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్ల బిజెపి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది..

సంకీర్ణ ప్రభుత్వాలలో ముఖ్యపాత్ర పోషించడం చంద్రబాబుకు ఇది కొత్త కాకపోయినప్పటికీ.. ఈసారి మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో నెంబర్ -2 స్థానంలో చంద్రబాబు కొనసాగుతున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రముఖ జాతీయ వార్తా విశ్లేషకుడు, “ఇండియా టుడే” సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా పై వ్యాఖ్యలే చేశారు..”చంద్రబాబు ఢిల్లీలో గత కొంతకాలంగా చురుకుగా కనిపిస్తున్నారు. దేశ రాజకీయాల్లోనూ తన మార్క్ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవల బడ్జెట్లో తన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిపించుకున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ తో మరింత సన్నిహితమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో వారిద్దరిని చూస్తే అదే అనిపించింది. దీని ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నంబర్ -2 అనడంలో ఎటువంటి సందేహం లేదని” రాజ్ దీప్ వ్యాఖ్యానించారు..