AP: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తరువాత కూడా హింస చెలరేగింది. కేంద్ర బలగాలు వచ్చేవరకు వివాదాలు సద్దుమనగ లేదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినా.. ఎక్కడా ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. దీంతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోయినట్లు అయింది. అయితే అంతకంటే ముందే.. గంజాయి,డ్రగ్స్ వంటివి పెద్ద ఎత్తున పట్టుబట్టడంతో ఏపీ పరువు పోయినంత పని అయ్యింది. నిషేధిత వస్తువులు ఎక్కడ పట్టుబడినా.. దాని మూలాలు ఏపీలో దొరకడం కూడా రాష్ట్ర పరువు పోవడానికి కారణమయ్యాయి.
అయితే ఇందులో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది. అవి బాధ్యత మరిచి తప్పు మీదంటే.. మీది అని విమర్శలు చేసుకోవడం కూడా జాతీయస్థాయిలో ఏపీ పరువు పోవడానికి కారణం. విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ దొరికితే.. అందులో మీ పార్టీ ప్రమేయం ఉందని.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెబుతూ.. అందుకు కారణం మీరంటే మీరు అని.. మీ పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని రాజకీయానికి అంటగట్టారు. కానీ అందులో రాజకీయ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని నవ్వుల పాలయ్యారు. అసలు అక్రమ వ్యాపారం చేసుకునే వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.
గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు ఈనాటిది కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న తతంగం అది. గిరిజనులకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్న కొందరు అక్రమార్కులు గిరిజనులను సమిధులుగా మార్చుకున్నారు. డబ్బు ఆశ చూపి గంజాయిని సాగు చేయిస్తున్నారు. అటువంటి ప్రాంతాలను, బాధితులను గుర్తించి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు మెరుగుపరచడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. అందుకే మన్యంలో గంజాయి సాగు అనేది సర్వ సాధారణంగా మారింది. కానీ అక్కడ గంజాయి సాగు చేయకుండా.. నియంత్రణ చర్యలు చేపట్టకుండా.. తప్పు మీదంటే మీది అని.. గంజాయి రవాణాలో మీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించుకోవడం కేవలం రాజకీయ ఎత్తుగడే. జరగాల్సిన గంజాయి సాగు, రవాణా యధావిధిగా సాగిపోతోంది.