Vijay Sai Reddy target: మద్యం కుంభకోణంలో( liquor scam ) వరుసగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడి విచారణ చేస్తోంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ముందు రోజు విచారించి.. తరువాత రోజు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే అటు సిఐడి, ఇటు ఈ డి పట్టు బిగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి చాలా కీలక విషయాలను ఈ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గతంలో వైసిపి లో జరిగిన పరిణామాలు, అప్పటి పరిస్థితుల ప్రభావంతోనే విజయసాయిరెడ్డి నోరు విప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వల్ల తాను గతంలో నష్టపోయానని భావించి.. ఇదే అదునుగా విజయసాయిరెడ్డి దెబ్బ కొట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ మనస్థాపంతోనే..
ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి దూరమయ్యారు విజయసాయిరెడ్డి. కోటరీ అంటూ ఆరోపణలు చేస్తూ బయటకు వెళ్ళిపోయారు. అయితే అది పూర్తి మనస్థాపంతో అని తేలిపోయింది. పార్టీలో నెంబర్ 2 అనేది కేవలం రాతల వరకే కానీ.. విజయసాయిరెడ్డి మాట చిల్లుబాటు కాకపోయేసరికి తీవ్ర ఆవేదనతో ఉండేవారట. మొన్నటికి మొన్న విశాఖలో తనకు ఒక ఇల్లు తప్పించి ఏమీ లేదని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైసిపి హయాంలో.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన మాటకంటే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చే వారిని.. తనకంటే వారికే ఆర్థిక లాభాలు కలిగాయి అన్నది విజయసాయిరెడ్డి బాధ. అయితే తనను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని విజయసాయిరెడ్డి ఆవేదనతో ఉండేవారు. అందుకే బయటకు వచ్చారు. అసలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పేరు చెప్పింది విజయసాయి రెడ్డి అని ఇప్పుడు ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఉంది.
నిత్యం కోటరీ పై విమర్శలు..
తరచూ కోటరి అంటూ ఆరోపణలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. దీంతో అంతా సజ్జల రామకృష్ణారెడ్డి పై అని భావించారు. కానీ విజయసాయిరెడ్డి అసలు టార్గెట్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకు వెళ్ళింది తానేనని.. పార్టీ ఏర్పాటు చేయించింది తానేనని.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసింది తానేనని.. ఇంత జరిగాక తనకు ఎటువంటి లబ్ధి జరగలేదన్నది విజయసాయిరెడ్డి లో ఉన్న ఆవేదన. పైగా ఉత్తరాంధ్ర ఇన్చార్జి పోస్టును తొలగించారు. సోషల్ మీడియా ఇన్ఛార్జి పోస్టును తప్పించారు. తాడేపల్లి కార్యాలయంలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. చివరకు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సైతం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భూమిక పోషించడంపై విజయసాయిరెడ్డి కీనుక వహించారు. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లి దారుణంగా దెబ్బతీయాలని చూశారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాలతోనే ఏపీ సిఐడితోపాటు ఈ డి గట్టిగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో చూడాలి.