AP Local Body Elections: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీకి అత్యంత విషమ పరిస్థితి ఇది. ఆ పార్టీ యాక్టివ్ అయిందని చెబుతున్నారు కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి లేదు. ఇంకా చాలా నియోజకవర్గాలకు ఇన్చార్జిలు అందుబాటులోకి రావడం లేదు. కొందరైతే ఎక్కడో ఉండి మేనేజ్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నట్టు సాక్షి మీడియాలోనే ప్రకటనలు ఇస్తున్నారు. వైసిపి హయాంలో ఐదేళ్లలో కొంతమంది బాగానే సంపాదించుకున్నారు. అయితే చాలామంది రాజకీయాల్లో ఉంటూనే వ్యాపారాలు కూడా కొనసాగిస్తారు. అలానే వైసీపీ మాజీ లకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతం వారు అక్కడ బిజీగా ఉన్నారు. నెలకు ఒకసారి చుట్టం చూపుగా నియోజకవర్గాలకు వచ్చి వెళ్తున్నారు. వైసీపీ అధికార పత్రిక సాక్షిలో మాత్రం నిత్యం కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు.. ప్రభుత్వ వైఫల్యాలు ఖండిస్తున్నట్టు లోకల్ విలేకరులతో ప్రకటనలు ఇప్పించి మామ అనిపించేస్తున్నారు. ఐ కమాండ్ సైతం అంతా బాగుందని.. ఆల్ ఈజ్ వెల్ అని సరిపెట్టుకుంటుంది… అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి.
ఆ ప్రాతినిధ్యమే కారణం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై 18 నెలలు అవుతుంది. కానీ ఆ పార్టీ ఎంతో కొంత యాక్టివ్ గా ఉందని భావించడానికి కారణం స్థానిక సంస్థల్లో( local bodies) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాతినిధ్యం. స్థానిక సంస్థలు ఎన్నికలు అంటే ఎలా ఉంటాయో వైసిపి శ్రేణులకు తెలియంది కాదు. ఎందుకంటే 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణుల పాత్ర, దూకుడు ఎప్పటికీ కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉంది. అయితే అప్పట్లో ఉన్న రెండు వనరులు ఇప్పుడు వైసీపీ శ్రేణులు దగ్గర లేవు. భరోసా ఇచ్చే నాయకుడు లేడు.. అధికారము లేదు. ఈ రెండు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పనవసరం లేదు. బలప్రయోగం చేసిన స్థానిక సంస్థల ఎన్నికలను సొంతం చేసుకోవచ్చు అని నిరూపించి చేసి చూపించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఇప్పుడు టిడిపి కూటమి కూడా దానినే అనుసరిస్తుంది.
Also Read: పల్లె పండుగ 2.O తో గ్రామీణ రోడ్లకు మహర్దశ
కూటమి దూకుడుకు తట్టుకోగలరా?
దమ్ముంటే ఒంటరి పోరాటానికి రండి అంటూ నిత్యం వైసిపి శ్రేణులు నినాదాలు చేస్తుంటాయి. అందుకే ఆ పార్టీకి పక్కన ఉండేందుకు కూడా ఎవరికి ఇష్టపడదు. ఆ పార్టీతో స్నేహం చేసేందుకు మిగతా రాజకీయ పార్టీలు ముందుకు రావు. పోనీ ఏదైనా పార్టీతో కలిసి అడుగులు వేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామంటే కుదిరే పనిగా లేదు. ఒకవైపు నియోజకవర్గ ఇన్చార్జిలు లేరు. మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు తమ సొంత పనులు చూసుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించరు. ఎందుకంటే స్థానిక సంస్థలతో పని లేకుండానే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. అయితే గత దశాబ్ద కాలంగా స్థానిక సంస్థల పదవులకు దూరంగా ఉన్నారు టిడిపి కూటమి శ్రేణులు. కచ్చితంగా వారు దూకుడుగా ఉంటారు. ఆ దూకుడును తట్టుకునే స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ లేదు. ముమ్మాటికి ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్ట స్థితి. మరి ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. అయితే రణమా? శరణమా? అన్నది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తెలియనుంది. అయితే వీలైనంతవరకు స్థానిక సంస్థల బహిష్కరణకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోందన్నది ఒక వాదన. మరి ఏం జరుగుతుందో చూడాలి.