Maoist Devaj: హిడ్మా.. దండకారణ్యంలో కీలకమైన నాయకుడు. స్కెచ్ వేస్తే కచ్చితంగా పని జరగాల్సిందే. అటువంటి చురుకైన మావోయిస్టు హిడ్మా.. నాలుగు పదుల వయసు కూడా లేని ఇతడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కన్నుమూశాడు.. హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ నేపథ్యంలో కీలకమైన మరో మావోయిస్టు చాలా కనిపించడం లేదు.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత.. బుధవారం కూడా దండకారణ్యంలో అది కూడా ఏపీ పరిధిలో మరొక ఎన్కౌంటర్ జరిగింది.. ఇందులో ఐదుగురు హతమయ్యారు.. వాస్తవానికి హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే వారి వివరాలను పోలీసులు బయట పెట్టడం లేదు.. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒక కీలకమైన నాయకుడు ఉన్నారని ప్రచారం జరుగుతుండగా.. అతని గురించి కనీసం చిన్న క్లూ కూడా పోలీసులు ఇవ్వడం లేదు. పశ్చిమ బెంగాల్ పారిపోయిన మావోయిస్టుల దళంలో కూడా ఆ కీలక నాయకుడు లేడని తెలుస్తోంది. దీంతో అతడు ఏమైపోయాడు అనే చర్చ మొదలైంది.
మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అయితే ఇదే సమయంలో ఏపీలోని ఐదు జిల్లాలలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు.. ఇందులో విజయవాడ నగర శివారు పరిధిలోని కొత్త ఆటోనగర్ ప్రాంతంలో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు.. పట్టుబడిన మావోయిస్టులలో తిరుపతి అలియాస్ దేవజ్(ఇప్పుడు ఇతడే కనిపించడం లేదు) తో పాటు ప్రొటెక్షన్ టీం సభ్యులు 9 మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజ్ ఎక్కడ ఉన్నాడో తెలియడం ఆందోళన కలిగిస్తోంది.. దేవజ్, హిడ్మా, ప్రొటెక్షన్ టీం సభ్యులతోపాటు పలువురు మావోయిస్టులు ఛత్తీస్ గడ్ నుంచి ఇక్కడికి వచ్చారని పోలీసులు చెబుతున్నారు.. స్పష్టమైన సమాచారంతోనే వారిపై నిఘా పెట్టి పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. దీంతో మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి.
కేంద్రంతో పాటు చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కు పాదం మోపడంతో మావోయిస్టులు సేఫ్ షెల్టర్ జోన్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిడ్మా, ఇంకా కొంతమంది మావోయిస్టు కీలక నేతలు ఆంధ్ర ఒడిషా బార్డర్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.. పార్టీ ఆదేశాల మేరకు జనజీవన స్రవంతిలో కలవడానికి పలు నగరాలలో తల దాచుకున్నట్టు సమాచారం. కేంద్ర బలగాలు ఆంధ్ర దండకారణ్యంలోకి రావడం.. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోవడం కలకలం రేపుతోంది.
మరోవైపు దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అతని గురించి ఎటువంటి సమాచారం బయటకు రావడం లేదు. మరోవైపు బుధవారం కూడా ఏపీలో ఎన్కౌంటర్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్కౌంటర్లో దేవ్ జీ చనిపోయాడా? పోలీసుల అదుపులో ఉన్నాడా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్ కూడా జరిగింది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.