Telugu Regional Parties : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారుతున్నాయి. మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తుండగా.. దానిని అడ్డుకట్ట వేసేందుకు యూపీఏ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీంతో కొత్తమిత్రులు, సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. కర్నాటకలో గెలుపు తరువాత కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఊపు వచ్చింది. కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి సాధ్యం కాదని తేలింది. దీంతో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కాంగ్రెస్ గొడుగు కిందకు రావాల్సిన అనివార్య పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా బీజేపీ కూడా జాగ్రత్త పడింది. మిత్రులను పెంచుకునే పనిలో పడింది.
బెంగళూరులో సమావేశమైన కాంగ్రెస్ మిత్రపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యాయి. దాదాపు దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహా.. బీజేపీ బాధిత వర్గాలు మిగిలిన పార్టీలు హాజరయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలేవీ హాజరుకాకపోవడం విశేషం. ప్రాంతీయ పార్టీలకు అసలు ఆహ్వానం లేకపోవడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పోరాటం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించాలని ప్రయత్నిస్తోంది. దీంతో సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం పంపలేదు. ఏపీలో అధికార వైసీపీ ఆది నుంచి కాంగ్రెస్ ను విభేదిస్తోంది. అటు చంద్రబాబు సైతం బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో టీడీపీ, వైసీపీ రెండింటికీ ఆహ్వానాలు అందలేదు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి సైతం తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క జనసేనకే ఆహ్వానం అందింది. గతంలో ఎన్డీఏలో పనిచేసి వివిధ కారణాలతో విడిపోయిన పార్టీలకు బీజేపీ ఆహ్వానించింది. దేశ వ్యాప్తంగా 30 పార్టీలు హాజరయ్యే అవకాశముంది. కానీ గతంలో ఎన్డీఏతో పనిచేసిన టీడీపీకి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్ తో ఫైట్ చేస్తున్నందున ఆహ్వానం పంపలేదు. ఏపీలో సీఎం జగన్ తో మొన్నటి వరకూ స్నేహహస్తం అందించింది. అలాగని నేరుగా సమావేశానికి ఆహ్వానించే పరిస్థితి లేదు. అటు టీడీపీని సైతం బీజేపీ దూరం పెట్టింది.
జాతీయ రాజకీయాల విషయంలో తెలుగు ప్రాంతీయ పార్టీలు డిఫెన్స్ లో పడ్డాయి. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక రకమైన అభద్రతాభావంతో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీకి సమదూరం పాటిస్తున్నాయి. మొన్నటి వరకూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుందన్న ధీమా వ్యక్తమైంది. కానీ కర్నాటక ఎన్నికల తరువాత సీన్ మారింది. కాంగ్రెస్ పుంజుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాల్లో ఐక్యతారాగం కనిపిస్తోంది. ఈ తరుణంలో ఏ కూటమి వైపు వెళ్లాలో తెలియక తెలుగు ప్రాంతీయ పార్టీలు గుంభనం పాటిస్తున్నాయి.