Nara Lokesh : దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొన్ని పార్టీల సిద్ధాంతాలు మారుతున్నాయి. డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఏర్పాటయింది. వ్యవస్థీకృతంగా కనిపించింది.కానీ ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ వారసుడు ఉదయనిధి పార్టీలో సుప్రీం గా మారారు. ఇప్పటివరకు మంత్రిగా ఉన్న ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో డిఎంకె మరోసారి వారసత్వ రాజకీయాలకు జై కొట్టింది.అయితే ఏపీలో డీఎంకేకు దగ్గరగా ఉంది టిడిపి. ఆ పార్టీలో సైతం.. ఎన్టీఆర్ హయాం వరకు అది కుటుంబ పార్టీ కాదు. తరువాత జరిగిన పరిణామాలతో అల్లుళ్ళు చేరారు. కుమారుల సైతం ఎంట్రీ ఇచ్చారు.దీంతో అది వారసత్వ పార్టీగా మారిపోయింది.అయితే లోకేష్ కంటే జూనియర్ అయిన ఉదయనిధి ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీలో లోకేష్ విషయంలో అది సాధ్యపడుతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 2017 లోనే మంత్రి పదవి స్వీకరించారు లోకేష్. రెండేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపొందడంతో మరోసారి మంత్రి అయ్యారు.అయితే లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? అంటే మాత్రం కనుచూపులో లేదని సమాధానం చెప్పవచ్చు.
* పవన్ ఉండగా నో ఛాన్స్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 134 స్థానాల్లో విజయం సాధించింది.అయినా సరే ఇదే పొత్తు కొనసాగాలని ఆ పార్టీ భావిస్తోంది. పొత్తు కొనసాగాలంటే జనసేన కీలకం. అలా జరగాలంటే పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. ఏకైక డిప్యూటీ సీఎం గా ఆయనను కొనసాగించడం అనివార్యం. ప్రస్తుతం మూడు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ చురుగ్గా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సైతం నమ్మదగిన మిత్రుడిగా కొనసాగుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం గా ఉండగా.. లోకేష్ కు ఆ పదవి ఇవ్వడం జరగని పని. ఈ లెక్కన లోకేష్ కు ఇప్పటికిప్పుడు పదోన్నతి లభించే అవకాశం లేదు.
* వారసత్వ రాజకీయాలకు బిజెపి దూరం
మరోవైపు కేంద్రంలోని బిజెపికి ఒక విధానం ఉంది. వారసత్వ రాజకీయాలకు ఆ పార్టీ దూరం. అందుకే ఇప్పటికిప్పుడు లోకేష్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామంటే ఆ పార్టీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సైతం వారసత్వ రాజకీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది హై కమాండ్. ఎక్కడా వారసత్వ రాజకీయాలను బిజెపి ప్రోత్సహించిన దాఖలాలు కూడా లేవు. అందుకే లోకేష్ విషయంలో సైతం బిజెపి నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఆదేశాలను చంద్రబాబు పాటిస్తున్నారు. ఈ లెక్కన లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు.
* అప్పుడే ఛాన్స్
అయితే భవిష్యత్తు రాజకీయాల్లో తప్పకుండా లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. వయసు రీత్యా చంద్రబాబు పక్కకు తప్పుకుంటే ఆ బాధ్యతలను పవన్ చేపడతారు. పవన్ డిప్యూటీ సీఎం హోదా లోకేష్ కు వస్తుంది. అది కూడా ఒక అంచనా మాత్రమే. అయితే పార్టీల పరంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. అటువంటప్పుడు ఏదో ఒక రోజు లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని టిడిపి వర్గాలు వాదిస్తున్నాయి. అంతకంటే ముందు డిప్యూటీ సీఎం పదవి విషయంలో మాత్రం లోకేష్ కనుచూపుమేరలో కూడా అవకాశాలు కనిపించడం లేదు.