Y. S. Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్. ప్రస్తుతం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. భాస్కరరెడ్డితో పాటు రిమాండ్ లో ఉన్న ఇతర నిందితులను సైతం విచారిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి సైతం రోజువారి విచారణకు హాజరవుతున్నారు. 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో..ఇప్పుడు ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు విచారించనున్నహైకోర్టు.. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని ఆదేశాలిచ్చింది.
సునీత పిటీషన్ తో..
వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత గట్టగానే పోరాడుతున్నారు. ఏప్రిల్ 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలివ్వడంతో సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటీషన్లు దాఖలు చేశారు. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, వైఎస్ అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఈ విషయం తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టులో జరగనున్న ముందస్తు బెయిల్ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చిచెబితే మాత్రం అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు కేసు తుది విచారణ గడువు జూన్ 30 వరకూ పొడిగించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ దక్కితే మాత్రం అవినాష్ రెడ్డికి కాస్తా ఉపశమనమే.

తుది విచారణకు దిశగా..
ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులు అంతా రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. చార్జిషీట్‌లో వైఎస్ అవినాష్ రెడ్డి పేరును పొందుపరిచారు. ఆయన విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐ అధికారులను ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించింది హైకోర్టు. ఇవ్వాళ్టి వరకు రిలీఫ్ కల్పించింది. గడువు ముగిసిన నేపథ్యంలో- ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు సీఐబీ విచారణ కొనసాగిస్తోంది. పులివెందులలో మరోసారి దర్యాప్తు చేశారు. కీలక అంశాలపై సీబీఐ అధికారులు ఆరాతీశారు. ఒకవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగా.. సీబీఐ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తుండడం ప్రధాన్యతను సంతరించుకుంది. మరింత లోతుగా చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతోనే సీబీఐ పట్టుదలగా విచారణ చేపడుతోందని తెలుస్తోంది.