Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు అధికార వైసిపి, ఇటు విపక్ష టిడిపి, జనసేనలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత కీలకం. పొరపాటున ఓటమి ఎదురైతే తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం. చంద్రబాబును నమ్ముకున్న వ్యవస్థలు, వ్యక్తులు సైతం దెబ్బతినక తప్పదు. అందుకే చంద్రబాబుకు మించి ఆ వ్యవస్థలు, వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబుకు మించి తపన పడుతున్నారు.
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువగా.. రాజ గురువు రామోజీ పైనే దృష్టి పెట్టారు. మార్గదర్శి చిట్ఫండ్ పై కేసులు నమోదు చేయించారు. చిట్ ఫండ్ ద్వారా సేకరిస్తున్న నగదుతో రామోజీరావు వ్యాపార విస్తరణకు చెక్ చెప్పారు. దీంతో రామోజీరావు జాతీయస్థాయిలో నెలకొల్పిన మీడియా ఛానళ్లను రిలయన్స్ కు విక్రయించుకునేలా పరిస్థితి తీసుకొచ్చారు. దీనంతటికీ కారణం మార్గదర్శి చిట్ ఫండ్స్ నుంచి పెట్టుబడులకు చెక్ చెప్పడమే. అయితే కేసులపరంగా రాజశేఖర్ రెడ్డి రామోజీరావు పట్ల ఉదారంగా వ్యవహరించారు. మరీ లోతుగా వెళ్లలేదు. కానీ జగన్ విషయంలో అలా కాదు. రామోజీరావు ఆర్థిక మూలాలను దెబ్బతీయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రామోజీరావుకు జైలు జీవితం తప్పదు. అందుకే చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు రామోజీరావు చేయని ప్రయత్నం అంటూ లేదు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వెనుక ఉండే వ్యవస్థలను, వ్యక్తులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యంగా అమరావతిరాజధాని చుట్టూ జరిగిన వ్యవహారాన్ని ముందుచూపుతో పసిగట్టిన జగన్.. ఆదిలోనే చెక్ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు అనుంగ వ్యవస్థ, వ్యక్తులు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారు. అదే జరిగితే చంద్రబాబు మహా శక్తివంతంగా మారుతారు. అందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అటు నారాయణ, గల్లా జయదేవ్ లాంటి వ్యక్తులను కంటిమీద కునుకు లేకుండా చేశారు. చుక్కలు చూపించారు కూడా. అందుకే ఈ తరహా వ్యక్తులు, వ్యవస్థలు తమ స్థాయికి మించి పని చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి.జగన్ అధికారంలోకి వస్తే ఏ పరిస్థితి ఉంటుందో గుర్తెరిగి మరి వీరంతా నడుచుకోవడం విశేషం.