AP Politics: వ్యవస్థలో లోపాలను ప్రశ్నించని వాడు నిజంగా అంధుడే. ఈ విషయంలో ఏపీ ప్రజలు తమను తాము ప్రశ్నించుకోవాలి. అంతరాత్మను ప్రశ్నించాలి. తెలంగాణలో ఒక సచివాలయ భవనాన్ని చూసి ఆనందించే ప్రజలు.. కళ్లెదుట అమరావతి రాజధాని నిర్మాణాన్ని చూసి ఎంత గర్వపడాలి. దానిని నిర్వీర్యం చేస్తున్న జగన్ సర్కార్ పై ఎంత ఆగ్రహం వ్యక్తం చేయాలి. కానీ మనకెందుకులే అన్న ధోరణిలో బతికేస్తున్నారు. తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా ఇదే కాన్సెప్ట్ తో గడిపేస్తున్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ ని అక్కడి ప్రభుత్వం గొప్పగా కట్టుకుంది. ఇది అభినందించదగ్గ విషయమే అయినా.. మరి మన పరిస్థితి ఏమిటన్న ప్రశ్న సగటు ఏపీ ప్రజలకు ఉండదా? ఎనిమిదేళ్ల కిందట మనకు ఒక అద్భుతమైన నగర నిర్మాణం ప్రారంభమైంది. దానికి కులం, ప్రాంతాన్ని అంటగట్టి నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మనకు తెలియవా. నిజానికి తెలంగాణ సెక్రటేరియట్ ఇంజనీరింగ్ కాలేజ్ నమూనాలో ఉంటుంది. దానికి బహుళ ప్రాచుర్యం కల్పించడంలో ఏపీ ప్రజలదే అగ్రస్థానం. కానీ నిర్వీర్యం అవుతున్న అమరావతి గుండె చప్పుడు మాత్రం మనకు తెలియదు.
విభజనతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల ప్రయాణం ఒకేసారి ప్రారంభమైంది. విభజిత ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా మిగిలింది. అయినా సరే కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. ప్రాధాన్యత క్రమంలో ముందుకు సాగింది. అటు పాలన..ఇటు రాజధాని నిర్మాణంతో ఏపీ వడివడిగా అడుగులేసింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో నూతన ఏపీ చేరింది. కానీ గత నాలుగేళ్లలో ఏపీలో ఏం జరుగుతోంది. రాష్ట్ర పునాదులను కూల్చేశారు. విధ్వంసకర పాలనతో ఏపీ అభివృద్ధిని పాడె కట్టేశారు. అయినా సరే మనకు పట్టడం లేదు.
అమరావతి కమ్మ కులానిది అన్నారు. వారి కోసమే రాజధానిఅని నమ్మించారు. ప్రజల్లో విస్తృతమైన భయాన్ని కల్పించారు. ప్రపంచ రాజకీయాలను విశ్లేషించే విజ్ఞానం ఉన్న ఆంధ్రుడు ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉండడం విచారకరం. కులం, ప్రాంతం అన్న మానసిక భావన కలిగించి ఏపీ ప్రజలకు దారుణ వంచనకు దిగినా పట్టించుకోకపోవడం వారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ప్రజలు మారకుంటే పాలకుల తీరు ఇలానే ఉంటుందని ఏపీ ఒక ఉదాహరణ.