Homeఆంధ్రప్రదేశ్‌Mega Nagababu : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మెగా నాగబాబు చెప్పిన ఉప్మా కథ...

Mega Nagababu : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మెగా నాగబాబు చెప్పిన ఉప్మా కథ ఏంటి..?

Mega Nagababu : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పక్షాలు ఎన్నికల కోసం సిద్ధమయ్యాయి. అధికార వైసిపి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా అనేక సభలను నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే కనిపిస్తోంది. మరో పక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ సభలు, సమావేశాల్లో పాల్గొంటూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. అలాగే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గలం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రకు సన్నద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇకపోతే, జనసేన కీలక నేత నాగబాబు సామాజిక మాధ్యమాల వేదికగా అధికార వైసిపిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. విభిన్న అంశాలపై ఆయన స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. తాజాగా కథాకళి ఎపిసోడ్ లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉప్మా కథను ఆయన చెప్పారు. ఆ కథ ఏంటి..? అందులో ఉన్న విషయం ఏంటో..? మీరు చదివేయండి.
జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో యాక్టిివ్ గా ఉండడంతోపాటు పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ అధికార వైసీపీపై విరుచుకుపడుతుంటారు. ఈ మధ్యకాలంలో కథాకళి ఎపిసోడ్ పేరుతో ఆయన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వైసిపి ప్రభుత్వ తీరును ఎండ గడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన చెప్పిన ఉప్మా కథ అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.

ఇది నాగబాబు చెప్పిన ఉప్మా కథ..
”ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో వందమంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజు ఆ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కింద ఉప్మా పెడుతుంటారు. వంద మందిలో 20 మంది విద్యార్థులు ఆ ఉప్మాను ఇష్టంగా తింటుంటారు. మిగిలిన 80 మంది విద్యార్థులు డైలీ ఉప్మా ఖర్మ ఏంట్రా బాబు.. మార్చండి అంటూ యాజమాన్యానికి చెప్పారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. గొడవ పెట్టగా పెట్టగా.. యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చింది. తాము ఓటింగ్ పెడతామని.. ఎక్కువ మంది ఏది కోరుకుంటే అదే పెడదామని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా రకరకాల ఐటమ్స్ లిస్టులో పెట్టి ఓటింగ్ లో పాల్గొనమని విద్యార్థులకు చెప్పారు. ఉప్మాని ఇష్టంగా తినే 20 మంది విద్యార్థులు మాత్రం దానికి ఓటు వేశారు. మిగిలిన విద్యార్థులు రకరకాల ఐటమ్స్ కావాలంటూ ఓట్లు వేశారు. అయితే, మిగిలిన 80 మంది విద్యార్థులు వేర్వేరు ఐటమ్స్ కోసం ఓట్లు వేయడం వలన ఈ 20 మంది ఓట్లను దాటలేకపోయారు. దీంతో యధావిధిగా మళ్లీ ఉప్మానే కొనసాగించడం హాస్టల్లో ప్రారంభించారు. అదే ఉప్మా వండి విద్యార్థులకు పెడుతున్నారు” అంటూ నాగబాబు ఉప్మా కథను వివరించారు.
తక్కువ శాతం మంది ఓట్లు వేసే వాళ్లే మనల్ని రూల్ చేస్తారు..
ఈ ఉప్మా కథను రాజకీయాలకు అన్వయిస్తూ తనదైన శైలిలో నాగబాబు విశ్లేషణ చేశారు. ఉప్మా కథలో మాదిరిగానే ప్రజల్లో ఐక్యత లేనప్పుడు తక్కువ శాతం ఓట్లు పొందిన వాళ్లే తమను రూల్ చేస్తారంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూటికి 80 శాతం మంది ఈ ఉప్మా ముఖ్యమంత్రిని వద్దంటున్నారని, వద్దు అనుకుంటున్నా ప్రజల కోసం కొన్ని రాజకీయ పార్టీలు వాళ్లు విడివిడిగా పోటీ చేసి మళ్లీ ఈ ఉప్మా ముఖ్యమంత్రిని ప్రజల మీద రుద్దకుండ ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల కోసం కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఈ ఉప్మా ముఖ్యమంత్రిని పదవిలో నుంచి దించి, ప్రజలకు ఉప్మా బాధ లేకుండా చేస్తే తప్పేంటి అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. అందుకే ఇష్టమున్నా, లేకపోయినా దుష్ట పరిపాలన, ఉప్మా ముఖ్యమంత్రి దించడానికి మనందరం కలిసి పోటీ చేయడంలో తప్పు లేదని, ఐ సపోర్ట్ యూ అంటూ ఉప్మా కథను నాగబాబు ముగించారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో నాగబాబు ఈ కామెంట్లు చేసినట్లు కనిపిస్తోంది.
Exit mobile version