Anil Kumar Yadav: గత ఐదేళ్ల కాలంలో వైసీపీకి చాలామంది ఫైర్ బ్రాండ్లుగా పనిచేశారు.జగన్ పై ఎవరైనా విమర్శ చేస్తే.. దానికి పదింతలు బదులు చెప్పేవారు.అటువంటి నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. తన హావ భావాలతో ప్రత్యర్థికి చుక్కలు చూపేవారు. అయితే అంతటి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించడం లేదు. కనీసం మీడియా కంట కనిపించడం కూడా లేదు. దీంతో అనిల్ రాజకీయాలకు దూరమయ్యారా?లేకుంటే వేరే ఆలోచనతో ఉన్నారా? అన్నది చర్చనీయాంశం అయ్యింది. అసలు అనిల్ ఏపీ లోనే ఉన్నారా? హైదరాబాదులో తలదాచుకుంటున్నారా? లేకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారా? అన్నది తెలియాల్సి ఉంది.
* వరుసగా రెండుసార్లు గెలుపు
2014,2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అనిల్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. దీంతో అనిల్ కుమార్ యాదవ్ కు అడ్డే లేకుండా పోయింది. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ నేతలను కూడా లెక్క చేయలేదు. సీనియర్ నేతలను సైతం తూలనాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాలం ఒకే మాదిరిగా ఉండదు కనుక.. విస్తరణలో మంత్రి పదవి కోల్పోయారు అనిల్. ఈ ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందని తెలుసుకున్న జగన్ నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు. అయిష్టత గానే వెళ్లిన అనిల్ అక్కడ కూడా గాంభీర్యం ప్రదర్శించారు. కానీ దారుణంగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడా కనిపించకుండా మానేశారు.
* ఆ భయంతోనే
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. నారాయణతో పాటు ఆనం రామనారాయణరెడ్డి మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ సీనియర్లే. గతం మాదిరిగా అనిల్ సౌండ్ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఈ విషయం అనిల్ కు కూడా తెలుసు. అందుకే ఆయన నెల్లూరు వైపు చూడడం మానేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని.. మధ్యలో నెల్లూరు వస్తున్న ఎవరిని కలవడం లేదని సమాచారం. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా వెళ్లడం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ తీరుపై సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.