Visakha Steel Plant: ఏ ఉద్యోగి అయినా తప్పనిసరిగా పని చేయాలి. ఆ పనికి తగ్గట్టు వేతనం తీసుకోవాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది కూడా. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఈ మాట ప్రధానంగా వినిపిస్తుంది. కానీ ఎక్కడ వివాదం చోటు చేసుకోదు. కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం పనిచేయమంటే ఉద్యోగులకు కోపం. పనికి తగ్గట్టు వేతనం ఇస్తామంటే అక్కడ కుదరదని ఉద్యోగులు తేల్చి చెబుతారు. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి. ప్రైవేట్ రంగంలో మరో మాటకు తావు ఉండదు. అలాగని ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా పనిచేస్తారు ప్రైవేటు ఉద్యోగులు. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant ) విషయంలో ఇదే తరహా వివాదం వచ్చింది. ప్రభుత్వ కంపెనీ మాదిరిగా ఉత్పత్తికి తగ్గట్టు వేతనాలు చెల్లిస్తామనేసరికి ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పనిచేయకపోతే ఎలా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించేసరికి వారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అగ్నికి ఆజ్యం పోసే బాధ్యతను సాక్షి మీడియా తీసుకుంది.
* కేవలం సెంటిమెంట్ తో..
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇందులో ఏపీ ప్రభుత్వానికి రూపాయి వాటా కూడా లేదు. అయినా సెంటిమెంట్ కారణంగా విశాఖ ఉక్కును కాపాడుకునే ప్రయత్నం చేసింది ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం. ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 14 వేల కోట్ల రూపాయలు మంజూరయ్యేలా చేసింది. కానీ ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. విశాఖ స్టీల్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. గిరాకీ అంతకుమించి ఉంది. కానీ అందుకు తగ్గట్టు ఉత్పత్తి మాత్రం జరగడం లేదు. కేంద్రం ఇస్తున్న నిధులు బూడిదలో పోసిన పన్నీరు గా మారాయి. అయితే ఇప్పుడు ఒక విషయం తెరపైకి వస్తోంది. విశాఖ స్టీల్ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. దానిని సరి చేసే ప్రయత్నం చేస్తుండగా అది తప్పుగా వారు భావిస్తున్నారు. ఉద్యమాలకు సన్నద్ధం అవుతున్నారు.
* యూనియన్ నేతల ముసుగులో..
వాస్తవానికి యూనియన్ల ముసుగులో చాలామంది ఉద్యోగులు పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. పైగా భారీగా వేతనాలు తీసుకుంటున్నారు. తాము చేయాల్సిన పనులను కాంట్రాక్టు ఉద్యోగులతో( contract employees) చేయిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎక్కువగా పనిచేస్తోంది ఒడిస్సా వాసులే. ఇక్కడ ఉన్నవారు యూనియన్ నేతలుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వాలతో పాటు రాజకీయ పార్టీలతో అంటగాకుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులమన్న విషయాన్ని మరిచిపోయిన వారు ఉన్నారు. అది గుర్తు చేసేసరికి వారు తట్టుకోలేకపోతున్నారు. పనిచేసేందుకు తటపటయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే మాట ప్రైవేటు సంస్థల్లో చెబితే లెక్కకు మించి పనిచేయడానికి అక్కడ ఉద్యోగులు సిద్ధపడతారు. పనిచేయండి, అందుకు తగ్గట్టు వేతనాలు తీసుకోండి.. పరిశ్రమను నిలబెట్టండి అంటున్న మాట వారికి ఎంత మాత్రం రుచించడం లేదు. ఇలాగైతే చాలా కష్టం. ప్రైవేటీకరణ వద్దంటున్నారు.. పనిచేయమని చెబుతున్నారు.