YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించను న్నారు. తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. ఆమె ఎంట్రీ తో ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయ్యింది.
ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వచ్చే నెలలో వివాహం జరగనుంది. ఈ తరుణంలో రేపు ఆమె పిసిసి అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇడుపాలపాయకు బయలుదేరి వెళ్ళనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం కడప నుంచి విజయవాడ వెళ్ళనున్నారు.
ఉదయం 11 గంటలకు విజయవాడలో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. షర్మిల ఏపీ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రేపు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్తున్న క్రమంలో ఆమె భారీ ర్యాలీ నిర్వహిస్తారని.. తన బలం ఏమిటో చూపించే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో షర్మిల ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆమె రాజకీయంగా ఏం మాట్లాడబోతున్నారు? జగన్ టార్గెట్ చేస్తారా? టిడిపి, జనసేన, బిజెపి విషయంలో ఆమె తీసుకునే స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. సామాన్య ప్రజల్లో సైతం బలమైన చర్చ నడుస్తోంది. మరి షర్మిల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.