Pithapuram Janasena: పిఠాపురం( Pithapuram) జనసేన లో గ్రూపులు ఉన్నాయా? నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి పెట్టారా? గ్రూపులతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా? అందుకే ఒక నిర్ణయానికి వచ్చారా? అందులో భాగంగానే కొత్త నియామకాలా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పిఠాపురం జనసేనకు సంబంధించి ఓ అయిదుగురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దీని వెనుక చాలా రకాల పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గ ఇన్చార్జికి బాధ్యతలు..
పిఠాపురం నుంచి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) భారీ మెజారిటీతో గెలిచారు. కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. అయితే రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు పవన్ కళ్యాణ్ పై ఉండడంతో నియోజకవర్గానికి ఇన్చార్జ్ ను నియమించారు. ఈ క్రమంలోనే పార్టీలో విభేదాలు ప్రారంభం అయ్యాయని.. నేతలు గ్రూపులు కడుతున్నట్లు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అసలు వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో జనసేన బాధ్యతలను చూసేందుకు ఓ ఐదుగురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావులను ఆ కమిటీలో నియమించారు. ఇకనుంచి జనసేనలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న ఈ కమిటీకే పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెట్టారు.
ఆయన ఒంటెద్దు పోకడలతో..
పిఠాపురంలో గెలిచారు పవన్ కళ్యాణ్. రాష్ట్రస్థాయిలో మంత్రి పదవులతో పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో తరచూ పిఠాపురం రావడానికి కుదరదు. అందుకే నియోజకవర్గ ఇన్చార్జిగా మర్రెడ్డి శ్రీనివాసరావుకు( Marreddy Srinivas Rao ) బాధ్యతలు అప్పగించారు. అయితే శ్రీనివాసరావు పార్టీ శ్రేణులను కలుపు కెల్లడం లేదన్న విమర్శ ఉంది. ఇటీవల జనసేన సమావేశంలో పవన్ కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వారి ముందే మర్రెడ్డిని పవన్ కళ్యాణ్ సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో ఐదుగురు నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇకనుంచి జనసేన కార్యక్రమాలన్నీ చేబ్రోలు లోని పవన్ నివాసం నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు క్యాంప్ ఆఫీసులో జనసేన కార్యకలాపాలు జరిగేవి. అయితే ఒక్కసారిగా పిఠాపురం జనసేనలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. దీనిపై బలమైన చర్చ నడుస్తోంది. పార్టీని గాడిలో పెట్టేందుకేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.