https://oktelugu.com/

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం కొనసాగుతోంది. తండ్రి అకాల మరణ సమయానికి రాధ విద్యార్థి జీవితంలో ఉన్నారు. అనూహ్యంగా ఆయనను 2004లో రాజకీయాల్లోకి తెచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

Written By: , Updated On : April 30, 2024 / 10:55 AM IST
Vangaveeti Radhakrishna

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna: వంగవీటి మోహన్ రంగ.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. కాపు ఉద్యమ నేతగా సుపరిచితుడు అయినా.. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడ్డారు. విజయవాడ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి.. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఒకసారే అయినా.. తెలుగు రాజకీయాలనే షేక్ చేసే స్థాయికి చేరారు. కానీ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. లేకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వారిని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ.. సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లో గెలిచినా.. మరో రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. మరో రెండు ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ దక్కకుండా పోయారు. అయితే దీనికి రాధాకృష్ణ స్వయంకృతాపమే కారణం.

వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం కొనసాగుతోంది. తండ్రి అకాల మరణ సమయానికి రాధ విద్యార్థి జీవితంలో ఉన్నారు. అనూహ్యంగా ఆయనను 2004లో రాజకీయాల్లోకి తెచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అప్పటివరకు కాలేజీ జీవితంలో ఉన్న రాధ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే అదే సమయంలో తన తండ్రి ప్రత్యర్థి దేవినేని నెహ్రూకు.. హైదరాబాదులో ఆస్తి వివాదం పరిష్కరించి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరేలా వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహరించారని రాధాకృష్ణ భావించారు. దానిని అవమానకరంగా భావించి… అప్పుడే పురుడు పోసుకున్న ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో రాధా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

2019 ఎన్నికల్లోవిజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ కోసం పట్టుపట్టారు రాధా. జగన్ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దానిని అవమానంగా భావించిన రాధా వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారారు. కానీ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆయన టిడిపిలోనే ఉన్నారు. అంటీ ముట్టనట్టుగా కొనసాగుతున్నారు. వైసీపీకి చెందిన కొడాలి నాని వల్లభనేని వంశీ మోహన్ తో స్నేహంగా మెలిగారు. అలాగని వైసీపీలో చేరలేదు. లోకేష్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. టిడిపి సైతం ఎక్కడా అకామిడేట్ చేయలేదు. అటు జనసేన నేతలతో సైతం సమావేశమయ్యారు. బిజెపి నేతలతో భేటీ జరిపారు. కానీ ఏ పార్టీ కూడా రాధాను పరిగణలోకి తీసుకోలేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాధా ప్రచారం చేస్తున్నారు. అయితే రాధాకు టిడిపి నాయకత్వం నుంచి గట్టి హామీ లభించి ఉంటుందన్న టాక్ నడుస్తోంది. అయితే యాక్టివ్ రాజకీయాలకు రాధా దూరం కావడం మాత్రం అభిమానులకు రుచించడం లేదు. రాధా పరిస్థితి చూసి వారు బాధపడుతున్నారు.