Jagan: జగన్ ధైర్యం ఏమైంది?

నిన్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యారు. కానీ వెనుక గేటు నుంచి వచ్చారు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చే దారిలో అమరావతి రైతులు ఎదురుపడతారన్న ఆందోళన. అందుకే ఆయన వెనుక నుంచి వచ్చారన్నది ఒక ఆరోపణ.

Written By: Dharma, Updated On : June 22, 2024 4:01 pm

Jagan

Follow us on

Jagan: కష్టాలను తట్టుకుని నిలబడ్డారు జగన్. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. పార్టీని ఏర్పాటు చేసి.. అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. జగన్ అంటే ధైర్యం.. ధైర్యం అంటే జగన్ అన్నంత రీతిలో వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకున్నాయి.అయితే అటువంటి జగన్ లో నమ్మకం సడలింది. ధైర్యం కనుమరుగైంది. సొంత పార్టీ శ్రేణులనే విస్మయపరిచింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తికర చర్చ నడిచింది. కానీ ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన ప్రతి అడుగు, వ్యవహరించిన తీరు చూస్తే మాత్రం కనీస ధైర్యం కూడా కనిపించలేదు. సాధారణంగా జగన్లో ఆత్మ నూన్యత భావం ఎక్కువ. అందుకే ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఆందోళనగా కనిపిస్తారు.నిన్న కూడా జరిగింది అదే.

నిన్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యారు. కానీ వెనుక గేటు నుంచి వచ్చారు. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చే దారిలో అమరావతి రైతులు ఎదురుపడతారన్న ఆందోళన. అందుకే ఆయన వెనుక నుంచి వచ్చారన్నది ఒక ఆరోపణ. అయితే సభలో ప్రవేశం, హావభావాలు సైతం వింతగా ఉండడం విశేషం. సభ ప్రారంభమైన వెంటనే రాకుండా.. తాను ప్రమాణం చేయాల్సిన సమయానికి సభలో అడుగుపెట్టారు. వచ్చి ఐదు నిమిషాల పాటు చివరి బెంచ్ లో కూర్చున్నారు. ప్రమాణం చేశాక అసెంబ్లీలో ఉండకుండా తన ఛాంబర్ కి వెళ్లిపోయారు. ఎక్కడా కాన్ఫిడెన్స్ తో ఆయన కనిపించలేదు. ఇది వ్యక్తిగతంగా ఆయనకు లోటు.

వైసిపికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ ఆ పార్టీకి కోటి 32 లక్షల ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. 40 శాతం మంది ప్రజల ప్రతినిధిగా జగన్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ధైర్యంతోనే సభలో అడుగు పెట్టాలి. సభా సాంప్రదాయాలను గౌరవించాలి. కానీ వాటన్నింటినీ మరిచిపోయారు జగన్. ఓటమి బాధతో తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. ఇది ఒక అధినేతగా సరైన చర్య కాదని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.