Homeఆంధ్రప్రదేశ్‌AP CM Jagan : తీసుకున్నారు సరే.. ఆ రూ.10 వేల కోట్లు ఏంచేశారు?

AP CM Jagan : తీసుకున్నారు సరే.. ఆ రూ.10 వేల కోట్లు ఏంచేశారు?

AP CM Jagan : జగన్ సర్కారు ప్రచార ఆర్భాటం గురించి అందరికీ తెలిసిందే. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా వైసీపీ శ్రేణులు జారవిడుచుకోవు. బడి అయినా.. గుడి అయినా భవనాలకు రంగు కొట్టాల్సిందే. చివరకు శ్మశానవాటికలను సైతం విడిచిపెట్టలేదు. ఇక రూపాయి పెట్టుబడి వస్తే వంద రూపాయలు వచ్చిందన్న రేంజ్ లో ప్రచారం చేసుకుంటారు. అయితే ఇప్పుడు కేంద్రం రూ.10 వేల కోట్ల రెవన్యూ భర్తీ చేసిందని.. నిధులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నిధుల గురించి జగన్ సర్కారు ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు ఆ నిధుల ప్రస్తావనే తేలడం లేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి కేంద్రం ఎప్పుడైనా ఓ వెయ్యి కోట్లు ఇస్తే.. నిధులు సాధించామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు రూ.పది వేల కోట్లు వచ్చినా.. విచిత్రంగా ప్రభుత్వం చెప్పుకోలేదు. మీడియానే బయట పెట్టింది. ఆ తరువాత విమర్శలు చుట్టుముట్టినా క్లారిటీ ఇవ్వలేదు. అసలు వచ్చాయా? లేదా? అని స్పష్టమైన ప్రకటన అంటూ చేయలేదు. అయితే తీరా ఈ మొత్తం తాకట్టు యావ్వరంతోనే కేంద్రం విడుదల చేసిందని తెలియడం విస్మయపరుస్తోంది. అయినదానికి కానిదానికి అందరి మీద పడే రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఒకరకమైన చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తాకట్టు పెట్టిందా? లేదా విపక్షాలే అలా ఆరోపిస్తున్నాయా? ఇప్పుడిదే అందరి నోటి వినిపిస్తున్న మాటలు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను తాకట్టు పెట్టేసి… రూపాయి సాయం అడగబోమని రాసిచ్చి తెచ్చుకున్నదే ఈ రూ.పది వేల కోట్లు అంటూ కొత్త చర్చ అయితే ప్రారంభమైంది. మున్ముందు దీనిపై విమర్శలు ముదిరే అవకాశముంది. కానీ దీనిని చల్లార్చాల్సిన వైసీపీ సర్కారు మాత్రం ఏమీ అవ్వలేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.

అయితే ఈ విషయంలో కొత్త వార్త ఒకటి చక్కెర్లు కొడుతోంది. రూ.10 వేల కోట్లలో రూ.4 వేల కోట్ల వివిధ రుణాల కింద ఆర్బీఐ జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఇంకా కేవలం రూ.6 వేల కోట్లే మిగిలిందన్న మాట.  ప్రస్తుతం ఉద్యోగులకు నెల నెలా జీతాలకే డబ్బులు చాలడం లేదు. నెలలో జీతాలు మూడో వారంలో జమ అవుతున్నాయి. ఇటువంటి సమయంలో అత్యంత పెద్ద సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి, రైతుభరోసా పథకం ప్రశ్నార్థకమయ్యాయి. ఈ రెండింటికే రూ.10 వేల కోట్లు అవసరం. కేంద్రం రెవెన్యూలోటు కింద ఇప్పుడు రూ.10 వేల కోట్లు జమచేయడంతో ముందుగా రైతుభరోసాకు ప్లాన్ చేస్తున్నారు.

విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఇచ్చే అమ్మఒడికి ఏంచేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. అమ్మఒడి కోసం మళ్లీ ప్రతి మంగళవారం బ్యాంకుల వల్ల వేలంలో పాల్గొనాల్సిందే. కేంద్రం రూ. పది వేల కోట్లు ఇచ్చిన వారం రోజుల తర్వాత ఆర్బీఐ వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.రెండు వేల కోట్ల రుణాలను తీసుకు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇచ్చిన రుణపరిమితిలో సగం మొదటి నెలన్నరలోనే తీసుకున్నారు. అమ్మ ఒడి కోసం మిగతా మొత్తం కూడా కూడా తీసుకుని పంచేసే అవకాశం ఉంది. ఇంత ఆకలితో ఉన్న వైసీపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరి చూసే కేంద్ర ప్రభుత్వం ఒక ఆట ఆడుకుంది. షరతు వర్తింపజేసి మరీ సాయాన్ని అందిస్తోందన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version