Pawan Kalyan: ఏపీలోనే ఇప్పుడు పిఠాపురం కీలక నియోజకవర్గం. డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తుండటమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు పవన్. గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గెలిస్తే పిఠాపురం నియోజకవర్గ స్వరూపమే మార్చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టారు. కూటమి గెలవడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత 6 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై పనిచేశారు. తాజాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. గత ఆరున్నర నెలల కాలంలో తాను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఏమేం చేశానని వివరాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరుతో సోషల్ మీడియా వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు.
* ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు
పిఠాపురం ఎమ్మెల్యేగా.. పిఠాపురం సమగ్ర అభివృద్ధి కోసం.. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని.. వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకుగాను రూ. 39.75 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సామాన్యుల వివాహాలకు గాను.. రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టీటీడీ కల్యాణ మండపం మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లప్రోలు తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్, మోటారు మరమ్మత్తుల కోసం 72 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. 32 ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రి కిట్లను సి ఎస్ ఆర్ నిధులతో అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం.. సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ముగ్గురు స్టాప్ నర్సులను నియమించినట్లు వెల్లడించారు. పిఠాపురం ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ కళాశాలలో ఆరో ప్లాంట్ మరమ్మత్తులు చేయించినట్లు వివరించారు.
* డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం
గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసామని ట్విట్ చేశారు పవన్. గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు లక్షల రూపాయలతో నూతన ఆర్ఓ ప్లాంట్, గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో 1,75,000 తో పెండింగ్ పనులు, చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో రెండు లక్షల నిధులతో ఆరో ప్లాంటు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* పారదర్శకతలో భాగంగానే
ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా గత ఆరున్నర నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియజేశానని డిప్యూటీ సీఎం తెలిపారు. భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మొత్తానికైతే ఆరున్నార నెలల కాలానికి సంబంధించి పవన్ శ్వేత పత్రం విడుదల చేసినట్లు అయ్యింది.