War Impact On Weddings: తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సీజన్ మళ్లీ మొదలైంది. అధిక జేష్ట మాసం ముగిసింది. దీంతో శుభకార్యాలు మొదలయ్యాయి. జూలై 9 వరకు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు సంబంధించి అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైంది. ఈనెల 15 నుంచి జూలై 9 వరకు పరిమిత శుభ ముహూర్తాలు ఉండడంతో.. వివాహాలు, గృహప్రవేశాలకు ముహూర్తాలు డిసైడ్ చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆషాడమాసం, గురు మూఢం ప్రారంభం అవుతుంది. మళ్లీ ఆగస్టు 15 వరకు ముహూర్తాలు లేవు. మళ్లీ శ్రావణమాసంలోనే ముహూర్తాలు ఉన్నాయి.
ముహూర్తాలు ఇవే
జూలై 9లోపు వేలాది వివాహాలు నిశ్చయం అయినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. జూన్ తో పాటు జూలై నెలలో ఈ ముహూర్తాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా జూన్ 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మరోవైపు జూలైలో 1, 6, 7, 9 తేదీలు కూడా ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. పరిమిత ముహూర్తాలు కావడంతో అటు పురోహితులు, ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా పురోహితులను ముందే మాట్లాడుకుంటున్నారు.
* మార్కెట్లో అన్ని రకాల ధరలు పెరిగాయి. దానికి కారణం యుద్ధం గా చూపుతున్నారు. ఇప్పుడు వివాహాలకు సంబంధించిన అన్ని రకాల ధరల పెరుగుదలకు యుద్ధం కారణమని చెబుతున్నారు. డెకరేషన్ తో పాటు ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. డీజిల్ తో పాటు పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనాల కిరాయి పెంచేశారు. నిత్యవసర వస్తువులతో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో.. క్యాటరింగ్ నిర్వాహకులు తమ ధరలను పెంచేశారు. ఇక ప్లేటు భోజనం ధర కూడా పెరిగింది. గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు పది లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
* శుభకార్యాలు అంటేనే ప్రధానంగా బంగారం కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. కానీ సామాన్యులు కొనలేని స్థితిలో బంగారం ధరలు ఉన్నాయి. సాధారణంగా ఒక వివాహానికి ఐదు నుంచి పది తులాల బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఆ లెక్కన కూడా దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వివాహాలకు. ఇలా ఎలా చూసుకున్నా శుభకార్యాలకు సైతం యుద్ధం ఎఫెక్ట్ తప్పడం లేదు..
