CM Jagan: ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరిక నెరవేరింది. ఒంగోలు వాసులకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందించాలని ఆయన పట్టుపట్టారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని తెగేసి చెప్పారు. దీంతో జగన్ దిగిరాక తప్పలేదు. శుక్రవారం ఒంగోలులో సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఉద్విగ్నంగా ప్రసంగించారు. దేశ చరిత్రలోనే పెద్ద మొత్తంలో పట్టాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వమేనన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మరోసారి పేద, ధనిక అన్న తేడాను ఎత్తిచూపుతూ టిడిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వ విద్య విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని జగన్ పిలుపునిచ్చారు. టిడిపి హయాంలో పేదలకు ప్రభుత్వ బడులు, డబ్బున్న వారికి ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు అందేవని.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లీష్ మీడియం బోధన అందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 8వ తరగతి విద్యార్థులకు డిజిటల్ బోధన, బైజుస్ కంటెంట్ తో ఆన్లైన్ బోధన, నాడు నేడు తో పాఠశాలల స్వరూపం మార్చడం, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం.. ఇవన్నీ విద్యావ్యవస్థలో సమూల మార్పులేనని జగన్ తేల్చి చెప్పారు.
వైద్య,ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని జగన్ వివరించే ప్రయత్నం చేశారు. గతంలో ధనికులకు మాత్రమే కార్పొరేట్ వైద్యం అందేదని.. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందిస్తున్న వైనాన్ని జగన్ గుర్తు చేశారు. పేద మహిళల సాధికారిత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ,చేయూత, అమ్మ ఒడి పథకాలు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. గతంలో ఇలాంటి పథకాలు లేని విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో పెత్తందారులకు మాత్రమే పదవులు వచ్చాయని.. ఇప్పుడు అన్ని వర్గాలకు పదవులు వచ్చేలా చేసామని జగన్ చెప్పారు.అసలు చంద్రబాబుపేదల కోసం ఒక్క పథకమైన ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. చివరకు పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే 1191 కేసులు వేశారని జగన్ విమర్శించారు.
కాగా ఈసారి చంద్రబాబును జగన్ టార్గెట్ చేసుకున్నారు. తాము సిద్ధం అంటుంటే.. చంద్రబాబు మాత్రం సిద్ధంగా లేరని ఆయన భార్య భువనేశ్వరి చెబుతున్నారని.. కుప్పంలో సైతం ఎదురుగాలి వీస్తుండటంతో ఆ మాటలు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాదిరిగా నాన్ రెసిడెన్స్ ఆంధ్రావాళ్లు, దత్త పుత్రుడు తోడు లేదని తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీరే నాకు తోడుగా నిలవాలని ప్రజలను మరోసారి జగన్ కోరడం విశేషం.