Homeఆంధ్రప్రదేశ్‌Vote For Cash Case: ఓటుకు నోటు: చంద్రబాబు పై వైసిపి అబద్ధాలు

Vote For Cash Case: ఓటుకు నోటు: చంద్రబాబు పై వైసిపి అబద్ధాలు

Vote For Cash Case: ఏదైనా ప్రచారం, వ్యూహం అనేది ఒకే మాదిరిగా ఉంటే అన్నివేళలా పనిచేయదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అదే చేస్తోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఉన్నారంటూ.. ఆ కేసు కోసమే అప్పట్లో కెసిఆర్ తో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్తో రాజీ పడుతున్నారు అంటూ ప్రచారం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఓటుకు నోటు కేసులో అసలు చంద్రబాబు ముద్దాయి కాదు. కోర్టుల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో చుక్కెదురు అయ్యింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన చంద్రబాబును ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్పించలేకపోయింది ఆ పార్టీ. కానీ ఇప్పుడు సైతం అదే కేసును తన రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటోంది. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు నిలిపి వేయించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.

* ల్యాబ్ లో అగ్నిప్రమాదంతో..
తాజాగా తెలంగాణ ఏసీబీకి సంబంధించి ఫొరెన్సిక్ ల్యాబ్( forensic lab) అగ్నిప్రమాదంలో దగ్ధం అయ్యింది. రెండు రోజుల కిందటే ఆ ప్రమాదం జరిగింది. అయితే ఆ ల్యాబ్ లో హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన సమాచారం ఉంది. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకు వచ్చింది. ఈ అగ్ని ప్రమాదం వెనుక చంద్రబాబు హస్తము ఉందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఓటుకు నోటు కేసు కు సంబంధించిన వివరాలు ఆ ల్యాబ్ లో ఉన్నాయి. ఆ ఫైల్స్ దగ్ధం చేసేందుకు రేవంత్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారన్నది వైసిపి ఆరోపణ. అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ సైతం ఉండడం.. అందుకే ఆ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అగ్ని ప్రమాదం చేయించినట్లు వైసిపి ఆరోపిస్తోంది. అంతటితో ఆగకుండా దానికి సైతం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాకుగా చూపుతోంది. అక్కడి ల్యాబ్ అగ్ని ప్రమాదానికి రేవంత్ సహకరిస్తే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపి వేసేందుకు చంద్రబాబు అంగీకరించారని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఇది పచ్చి అబద్ధం.

* చంద్రబాబు పేరే లేదు..
ఓటుకు నోటు కేసు అనేది 2015లో జరిగింది. ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీ ని ప్రలోభ పెట్టారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏవన్ గా ఉన్నారు. మరో నలుగురు వరకు నిందితులను చూపింది తెలంగాణ ఎసిబి. ఎక్కడా కూడా చంద్రబాబు ప్రస్తావన తేలేదు. అసలు నిందితునిగా కూడా చూపలేదు. కోర్టుకు దాఖలు చేసిన చార్జి షీట్లో మాత్రం చంద్రబాబు ప్రస్తావన ఒకచోట మాత్రమే ఉంది. అందుకే వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న ఈ పిటిషన్ ను కోర్టు రద్దు చేసింది. దానిని సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటీషన్ ను రద్దు చేసింది. తద్వారా చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు లేదని తేలిపోయింది.. ఈ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం తెలుసు. కానీ దానిపైనే నిరంతరం ఆరోపణలు చేస్తోంది. కేవలం రాజకీయ కోణంలోనే ఈ ఆరోపణలు ఉంటున్నాయి.

* ప్రత్యేక ప్రకటన.. తెలంగాణలో( Telangana) ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించి కీలక అధికారులు స్పష్టతనిచ్చారు. ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ టాపింగ్ కేసునకు సంబంధించి ఫైల్స్ దగ్ధం కాలేదని ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మరోవైపు తెలంగాణలో మరో ప్రచారం నడుస్తోంది. గులాబీ పార్టీ ఈ ఘాతుకానికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగు కేసుకు సంబంధించి ఆధారాలను చెరిపేసేందుకు బీఆర్ఎస్ ఇలా చేసి ఉంటుందని అనుమానిస్తోంది. గులాబీ పార్టీ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఓటుకు నోటు ప్రస్తావన తెస్తోంది. చంద్రబాబు ప్రస్తావన తేవడం లేదు. రేవంత్ ను టార్గెట్ చేస్తోంది. అయితే రేవంత్ పేరు ఓటుకు నోటు కేసులో ఉంది కాబట్టి.. రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆ ఆరోపణ చేయవచ్చు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటుకు నోటు ప్రస్తావన తీసుకొస్తూనే ఉంది. పోనీ రాయలసీమ ఎత్తిపోతల పథకం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయింది అంటే ఆ మాట అనవచ్చు. కానీ 2020 లోనే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టారు. ప్రజల సానుభూతి పొందేందుకు అలా వ్యవహరించారని జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం అనుమతులు సైతం నిలిపివేసింది. దానికోసం ఆయన చేసిన ప్రయత్నాలు అంటూ అప్పట్లో లేవు. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత నిలిపివేశారని.. దానిని ఫోరెన్సిక్ అగ్నిప్రమాదంతో పోల్చడం.. ఓటుకు నోటు ప్రస్తావన తీసుకురావడం చూస్తుంటే.. ఎంతటి తప్పుడు ప్రచారమో అర్థం చేసుకోవచ్చు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular