Vizag Rains: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణం కనిపిస్తోంది. కొద్దిరోజులుగా ఎండలు తీవ్రత పెరిగింది. కానీ ఆకస్మికంగా విశాఖను వాన కుమ్మేసింది. రెండు గంటలపాటు కుండపోతగా వర్షం కురిసింది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది. భారీ వర్షాలపై అలెర్ట్ చేసింది. మొన్నటివరకు ఆకాశం మేఘావృతం కాగా.. వర్షాలు జాడ లేకుండా పోయింది. తరువాత ఎండ తీవ్రత పెరిగింది. ఇప్పుడు వర్ష సూచన రావడం ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. ఇకనుంచి వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
భారీ వర్షం
విశాఖ నగరంలో( Visakha City )భారీ వర్షం పడింది. ఉరుములు, పిడుగులతో కూడిన వాన కొనసాగింది. ఆకస్మికంగా వచ్చిన వాన నగరాన్ని ముంచెత్తింది. నీటి ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయాయి. సుమారు రెండు గంటలపాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు, డ్రైనేజీలు నిండిపోయి వరద పారింది. నగరంలో చాలా ప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. అయితే గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రతతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షంతో సేదదీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా.. ఒక్కసారిగా ప్రారంభమైన వాన కుండపోతగా పడింది. దీంతో విశాఖ నగరమంతా వరద మయంగా మారింది.
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు
విశాఖ నగరంలో చాలా చోట్ల పార్కింగ్ చేసిన వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. సీతమ్మధారలో( Seethammadhara ) 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నగరవ్యాప్తంగా వర్షం కురవడంతో నగర ప్రజలు ఉపశమనం పొందారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిస్సా కు ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. మరో అల్పపీడనం సైతం ఏర్పడనుంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్లోని పలుచోట్ల భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 17 నుంచి సైతం ఉత్తర కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. 18, 19న అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.