Ganesha Idols : విశాఖలో భారీ గణనాథుడు కొలువుదీరాడు. ఏకంగా 117 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అని నిర్వాహకులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి రికార్డ్ స్థాయిలో.. జాతీయస్థాయిలో గుర్తింపు లభించే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాజువాక లోని లంక మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. శ్రీ అనంత పంచముఖ మహాగణపతి రూపంలో రూపొందించారు.
ఖైరతాబాద్ విగ్రహం తరహాలో ఏటా విశాఖలోని గాజువాకలో భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తెలంగాణకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు కొత్తకొండ నగేష్ పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా కి 26 మంది కళాకారులు ఈ విగ్రహ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. సుమారు 120 అడుగుల ఎత్తు, 39 అడుగుల వెడల్పుతో మండపాన్ని ఏర్పాటు చేశారు.
అత్యంత నియమ నిష్ఠలతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. విగ్రహం తయారీ కోసం పశ్చిమబెంగాల్ నుంచి గంగానది మట్టిని తీసుకొచ్చారు. విగ్రహం తయారీలో చెరువు మట్టి, వెదురు, గడ్డిని ఉపయోగించారు. విగ్రహానికి ఓవైపున 10 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పుతో అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల తయారీకి ఎనిమిది టన్నుల మట్టి, ఐదు టన్నుల వెదురు ఉపయోగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 117 అడుగుల ఈ భారీ గణనాథుడి కోసం.. 117 కిలోల లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడం విశేషం. విశాఖ నగరం నలుమూలలతో పాటు ఉత్తరాంధ్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. 117 అడుగుల భారీ గణనాథుడిని దర్శించుకుంటున్నారు.