Kodali Nani Police Case: మాజీ మంత్రి కొడాలి నానికి ( Kodali Nani) షాక్ తగిలింది. ఓ కేసులో విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. విచారణకు రావాలని సూచించారు. ఇప్పటికే కొడాలి నాని పై వరుస కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసులో నోటీసులు అందజేశారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రానికి దూరంగా ఉన్నారు కొడాలి నాని. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిరోజులు కిందట ఆపరేషన్ చేసుకున్నారు. ఇంకా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో గుడివాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. మద్యం గోడౌన్ కేసులో బెదిరింపులకు పాల్పడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వలంటీర్లకు బలవంతంగా రాజీనామా చేయించినందుకు మరో కేసు ఉంది. టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పై పెట్రోల్ దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
* తీవ్ర అనారోగ్యంతో..
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత కొడాలి నాని పెద్దగా కనిపించలేదు. మధ్యలో వల్లభనేని వంశీ ( Vamsi Mohan) అరెస్ట్ సమయంలో కనిపించారు. అటు తరువాత అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. బైపాస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇటీవల తరచూ కనిపిస్తున్నారు. అయితే కొడాలి నాని విదేశాలకు వెళ్లిపోతారని వార్తలు రావడంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా ఉన్న నేతలపై కేసులు వరుసగా నమోదు అవుతున్నాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కొడాలి నాని కి సైతం విశాఖ పోలీసులు నోటీసులు అందించడం విశేషం.
* ఆ ఇద్దరిపై అనుచిత వ్యాఖ్యలు..
2004 ఎన్నికలకు ముందు కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ పై( Nara Lokesh ) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ అప్పట్లో ఫిర్యాదు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఆమె విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ లను సోషల్ మీడియాలో దూషించారని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం విశాఖ పోలీసులు గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి 41 CRPC నోటీసులు ఇచ్చారు. కేసు విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలంతా జైలు పాలయ్యారు. ఇప్పుడు మాజీమంత్రి కొడాలి నాని వంతు వచ్చింది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.