Visakhapatnam Google Data Center: విశాఖలో( Visakhapatnam) ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ అయింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఆనందపురం మండలం తర్లు వాడలో 308 ఎకరాల భూమిని సిద్ధం చేసి త్వరలో గూగుల్ సంస్థకు అప్పగించనున్నారు. దాదాపు రైతుల భూములకు పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. సింహాచలం భూముల కేటాయింపునకు సంబంధించిన ఫైలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. బెంగళూరుకు చెందిన ఆర్ఎం జెడ్ కార్పొరేషన్ విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఇదివరకే ఒప్పందం చేసుకుంది. అయితే తాజాగా ఆ సంస్థ శంకుస్థాపనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరిలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన ఉంటుందని విశాఖ జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత సంస్థ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు..
ఆసియాలోనే అతి పెద్దది..
ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ( Google data centre) విశాఖలో ఏర్పాటు కానుంది. కొద్ది నెలల కిందట ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకుంది. అప్పటినుంచి రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా భూముల సేకరణకు సంబంధించి వేగవంతం చేసింది. ఆనందపురం మండలం తర్లువాడ పరిసరాల్లో 308 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. త్వరలో ఏపీఐఐసీ ద్వారా గూగుల్ కు ఆ భూములను అప్పగించునుంది. 51 మంది రైతుల నుంచి సేకరించిన భూములకు గాను 49 మంది రైతుల ఖాతాల్లో పరిహారానికి గాను డబ్బులు జమ చేశారు. మిగతా ఇద్దరు రైతులకు కూడా జమ చేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు.
నీటి సరఫరాకు ఏర్పాట్లు..
అయితే ఈ గూగుల్ డేటా సెంటర్కు నీరు చాలా అవసరం. జీవీఎంసీ( gvmc) ద్వారా నీటిని అందించే పనులపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు సింహాచలం భూముల కేటాయింపులకు సంబంధించి ఫైల్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రక్రియ పూర్తయితే డేటా సెంటర్ ఏర్పాటుకు కీలక అడుగు పడినట్టే. మరోవైపు ఫిబ్రవరిలోనే డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల దావోస్ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ RMZ సంస్థతో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టనుంది సదరు సంస్థ. ఈ నేపథ్యంలో RMZ ప్రతినిధులు విశాఖ తో పాటు విజయనగరంలో పర్యటించారు. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించారు.