Visakhapatnam : విశాఖలో టిడిపి కూటమి( Telugu Desam Party Alliance) సంపూర్ణ విజయం దక్కించుకుంది. కేవలం పంతం పట్టి మరి వైసిపి మేయర్ ను గద్దె దించింది. మేయర్ గా తెలుగుదేశం పార్టీ నేత.. డిప్యూటీ మేయర్ గా జనసేన నేత పదవిని అలంకరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సాయంతోనే కూటమి సరికొత్త రాజకీయం చేసింది. పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో ఆగ్రహంతో ఉన్న టిడిపి కూటమి.. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది.
* నాలుగు దశాబ్దాల తర్వాత..
విశాఖ నగరపాలక సంస్థపై( Vishakha Municipal Corporation ) కూటమి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రేటర్ విశాఖ పీఠాన్ని కైవసం చేసుకుంది. మేయర్ గా ఆ పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నగరంతో పాటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తి పట్టు సాధించినా.. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నాలుగు దశాబ్దాలుగా ఆ పార్టీకి గ్రేటర్ పీఠం అందని ద్రాక్షగా మిగిలింది. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ నగరపాలక సంస్థలో పూర్తిగా సీన్ మారింది. క్రమేపి కూటమి ఆధీనంలోకి గ్రేటర్ వచ్చింది. దీంతో టిడిపి కూటమి ఇక్కడ పట్టు సాధించింది. అదే సమయంలో జనసేన సైతం తన బలం పెంచుకుంది. విశాఖ మేయర్ స్థానాన్ని టిడిపి చేజిక్కించుకోగా.. డిప్యూటీ మేయర్ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. దీంతో ఇక్కడ కూటమి సంపూర్ణ విజయం సాధించినట్లు అయింది.
Also Read : సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!
* ఎన్నికల్లో వైసీపీ విజయం..
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ నగరపాలక సంస్థను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) దక్కించుకుంది. మొత్తం 98 డివిజన్లకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 48 చోట్ల పాగా వేసింది. ఆ పార్టీకి చెందిన బీసీ మహిళ నేత గొలగాని వెంకట హరి కుమారి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. మరోవైపు డిప్యూటీ మేయర్ గా జియాని శ్రీధర్ కు అవకాశం ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే మున్సిపల్ ఎన్నికల సమయానికి విశాఖ స్టీల్ అంశం తెరపైకి వచ్చింది. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీ 29 డివిజన్ లకే పరిమితం అయింది. జనసేన మూడు డివిజన్లను సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి విజయం దక్కడంతో ఆ పార్టీకే డిప్యూటీ మేయర్ తో పాటు మేయర్ పదవి లభించింది.
* మారిన సీన్..
2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం సీన్ మారింది. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను టిడిపి కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు.. ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమీప బంధువులు సైతం కూటమి వైపు మొగ్గు చూపారు. దీంతో విశాఖ నగరపాలక సంస్థలు బలాబలాలు తారుమారు అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఫిరాయించడంతో టీడీపీ కూటమి ఇక్కడ పాగావేసింది.
Also Read : విశాఖ నుంచి విదేశాలకు.. కొత్త విమాన సర్వీసులు!
* పుంజుకున్న జనసేన
అయితే విశాఖ నగరపాలక సంస్థలో జనసేన( janasena ) అనూహ్యంగా పుంజుకుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు ఆ బలం 13 డివిజన్లకు పెరిగింది. ఎన్నికలకు ముందు కొందరు చేరగా.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు జనసేనలో చేరారు. దీంతో ఆ పార్టీకి ఉన్నపలంగా బలం పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికల్లో జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కింది. ఆ పార్టీకి చెందిన 64 వ డివిజన్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు.