Visakha IT Hub: విశాఖ ఐటీ హబ్ గా( IT hub) మారబోతోంది. ఒక్కో ఐటీ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాయి సదరు సంస్థలు. రేపు కాగ్నిజెంట్ తమ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. కాగ్నిజెంట్ సీఈవో హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఒక్క కాగ్నిజెంట్ కాదు.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫత్వ వంటి సంస్థలు సైతం వచ్చే ఆరు నెలల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడతాయి. వచ్చే రెండేళ్లలో విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే జరిగితే విశాఖ ఐటీ హబ్ గా కార్యరూపం దాల్చనుంది. లక్షలాది ఉద్యోగులకు స్వర్గధామం గా నిలవనుంది. విశాఖను ఏ స్థాయిలో చూడాలనుకున్నారో.. ఆ స్థాయిలో చూడబోతున్నారన్నమాట.
సాగరనగరం ప్రత్యేకం అదే..
ఉమ్మడి ఏపీలోనైనా.. నవ్యాంధ్రప్రదేశ్ లోనైనా విశాఖ( Visakhapatnam) నగరం ఎప్పుడు ప్రత్యేకమే. ఎందుకంటే పచ్చదనం, ఆపై పర్యాటక శోభితం విశాఖ సొంతం. ఒక ఆర్థిక రాజధానిగా విశాఖను చూసుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచనతోనే విశాఖను రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. కానీ నేరుగా ఎంపిక చేసుకొని ఉంటే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసేవారు కాదు. అప్పటికే అమరావతి రాజధాని అనేది నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు. పోనీ విశాఖను అభివృద్ధి చేసి రాజధానిగా ప్రకటించి ఉంటే ప్రజలు సంతృప్తి పడేవారు. కానీ విశాఖలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా.. రాజధానిగా ఎంపిక చేయడం అనేది అనుమానాలకు తావిచ్చింది. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రకటన సంతృప్తి పరచలేదు. విశాఖను ఇప్పుడు పర్యాటక రంగంతో పాటు ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తోంది కూటమి ప్రభుత్వం. విశాఖలో ఈ తరహా అభివృద్ధితో పాటు విశాఖ బయట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ఇలా ఎటు చూసినా విశాఖలో అభివృద్ధి కనిపిస్తోంది.
అదే టర్నింగ్ పాయింట్..
విశాఖకు గూగుల్ డేటా సెంటర్( Google data centre) రావడం అనేది టర్నింగ్ పాయింట్. కలిసి వచ్చే అంశం కూడా. అన్ని రకాల అనుబంధ పరిశ్రమలు రాక మొదలయ్యాయి. అయితే ఒక్క పారిశ్రామిక రంగంలోనే కాదు పర్యాటక రంగంలో కూడా ముందడుగు వేస్తోంది విశాఖ. అయితే విశాఖ ప్రజలు ఇతర అభివృద్ధిని కోరుకున్నారు. ఉత్తరాంధ్రవాసులు విశాఖను రాజధానిగా కంటే ఐటీ హబ్ గానే ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే తమ పిల్లలు బెంగళూరులో, హైదరాబాదులో ఉండే కంటే తమ కళ్లెదుటే విశాఖలో ఉంటే.. తమకు బాగుంటుంది. వారికి బాగుంటుందన్న ఆలోచన సగటు తల్లిదండ్రులది. అందుకే విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటు అనే మాట వచ్చిన ప్రతిసారి ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో ఆనందిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు.