Vijaysai Reddy New Party: విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) పార్టీ పెడతారా? అది సాధ్యమేనా? అంటే సాధ్యమే కానీ మనుగడ అనేది అంత ఈజీ కాదు. ఆయన పార్టీ పెడతానని అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతోంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంది. బహుశా దానిలో చీలిక తెచ్చేందుకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అనవచ్చు కానీ.. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. సాధారణంగా అధికార పార్టీలు కొత్త పార్టీలను ప్రోత్సహిస్తుంటాయి. తద్వారా ఓట్ల చీలికతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు వస్తాయని. ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించడం వెనుక అదే పరమార్థం ఉన్నట్లు తెలుస్తోంది. పోనీ గొప్ప మాస్ లీడర్ అనుకుంటే కూడా విజయసాయిరెడ్డి లో కనిపించదు. ఎందుకంటే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఎదిగారు. అంతకుమించి సొంత ఇమేజ్ అంటూ లేదు.
* ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టం..
మనదేశంలో ఎంతోమంది పార్టీలను ఏర్పాటు చేశారు. అందులో కొన్ని పార్టీలు మాత్రమే బతికాయి. మన రాష్ట్రంలోనే తీసుకుందాం ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) వంటి వారి పార్టీలు పెట్టారు. నడపలేకపోయారు. అంతెందుకు విజయశాంతి పార్టీ ఏర్పాటు చేయలేదా? నందమూరి హరికృష్ణ పార్టీ ఏర్పాటు చేయలేదా? లక్ష్మీపార్వతి పార్టీని నడపలేదా? కానీ అవన్నీ మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయాయి. అయితే ఈ పార్టీల ఏర్పాటు వెనుక సైతం రాజకీయాలు నడుస్తుంటాయి. అయితే ఇవన్నీ విజయసాయి రెడ్డికి తెలియనివి కావు. ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన వెనుక లాభనష్టాలు కూడా ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో సైతం విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అలాగే ఒక సొంత పార్టీ ఏర్పాటు చేసి మనుగడ సాగిస్తామంటే కుదిరే పని కాదు.
* అభద్రతాభావంతోనే..
విజయసాయిరెడ్డి లో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలోకి తిరిగి వెళ్లాలనుకున్న వీలుపడదు. పోనీ బిజెపిలో చేరుదామంటే టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అలాగని టిడిపి తో పాటు జనసేనలో చేరలేరు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటాను అని ప్రకటించి ఉండవచ్చు. అయితే వైసీపీలోకి వెళ్లిపోతారని కొందరు.. కాదు కాదు జనసేనలో చేరుతారని మరికొందరు.. లేదు లేదు బిజెపిలోకి వెళ్తారని ఇంకొందరు ఇలా రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఇంకా తనలో రాజకీయ యావ ఉందని చెప్పేందుకు.. తాను క్రియాశీలకంగా ఉన్నానని తెలియజేసేందుకు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.