Vijayawada Lenin Center: ఏపీలో( Andhra Pradesh) బిజెపి బలపడక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కంటే బిజెపి రాష్ట్రంలో సీనియర్. ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందే విశాఖ నగరపాలక సంస్థను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ ఇప్పటివరకు పొత్తు లేకుండా ఒక్క సీటు తెచ్చుకోవడం కూడా కష్టం. అయితే ఏపీలో మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తామంటే ప్రజలు సహించరు. కానీ బిజెపి పాత చింతకాయ వాసన మాదిరిగా.. అదే మత రాజకీయాలను నమ్ముకుంటూ వస్తోంది. మిగతా రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలకు ఇష్టమైన పోరాటాలు చేయడం లేదు. ప్రజాభిష్టానికి అనుగుణంగా నడుచుకోవడం లేదు.
లెనిన్ సెంటర్ పేరు మార్చాలని..
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా యువనేత పివిఎన్ మాధవ్( pvn Madhav) ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన చేసిన ప్రకటనపై ఇప్పుడు భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ పేరు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. వామపక్ష భావజాలం ఉన్న ప్రపంచ నేత లెనిన్. అయితే అక్కడ లెనిన్ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆ జంక్షన్కు లెనిన్ జంక్షన్ గా పిలుస్తున్నారు విజయవాడ నగర ప్రజలు. పైగా అది ఆ పేరుతోనే సుపరిచితం అయింది. ల్యాండ్ మార్క్ గా నిలిచింది. అయితే లెనిన్ అంటే వామపక్ష భావజాలం, ఇంటలెక్చువల్ పర్సన్స్ కు మాత్రమే తెలుసు. సామాన్య జనాలకు అంతగా తెలియదు. అయితే గుర్తించేందుకు, పలికేందుకు లెనిన్ సెంటర్ అనేది అందరికీ సుపరిచితం అయ్యింది. అటువంటి పేరు మార్చాలని డిమాండ్ చేయడం సామాన్య జనాలకు మింగుడు పడడం లేదు.
Also Read: జగన్ పాదయాత్ర టైమింగ్ మిస్ అవుతోందా?
గుంటూరు జిన్నా సెంటర్ పై సైతం
మరోవైపు గుంటూరులో( Gunturu ) జిన్నా సెంటర్ పేరు మార్చాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. అది కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని హిందుత్వ సంఘాలు ఎక్కువగా డిమాండ్ చేస్తూ వచ్చాయి. వాస్తవానికి మహమ్మద్ జిన్నా అనే పాకిస్తానీ గాంధీ పేరు అది. కానీ స్థానికులు మాత్రం జిన్నా సెంటర్ అంటే.. ఆ పాకిస్తానీ నేత గురించి కాదని.. పిలిచేందుకు సులువుగా ఉంటుందని భావించి ఆ పేరు పెట్టి ఉంటారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జిన్నా అనే వ్యక్తి ఒకరు ఉన్నారని కూడా తెలియదు. ముస్లిం ప్రభావిత ప్రాంతం అని మాత్రమే తెలుసు. అటువంటి పేర్లు మార్పు ద్వారా బిజెపి మత రాజకీయం చేస్తుందన్న ముద్ర పడుతుంది. పైగా వామపక్ష భావజాలం ఉన్న నేతల పేర్లు మార్చి.. అదే వామపక్షాలను మళ్ళీ పైకి లేపాలని బిజెపి భావిస్తున్నట్టు ఉంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గుణపాఠాలుగా మార్చుకోవాల్సిన బిజెపి అదే తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది.