Vijayasai Reddy Political Re Entry: విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? తిరిగి రాజకీయ జీవితం ప్రారంభిస్తారా? అలా అయితే ఏ పార్టీలో చేరుతారు? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాదిరిగానే వ్యవసాయం చేసుకుంటున్నట్లు ఒకటి రెండు ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అటు తరువాత పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మనసు మారిందని.. తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఉందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమని సన్నిహితులు చెబుతున్నారు.
* వైయస్ కుటుంబ విధేయుడు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) కుటుంబానికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి. ఆ కుటుంబానికి ఆడిటర్ కూడా. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తిగా మారిపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా ఏ2గా మిగిలిపోయారు. జగన్ తో పాటు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఆ పార్టీని విస్తరించడంలో, అధికారంలో తీసుకురావడంలో సాయి రెడ్డి పాత్ర ఉంది. వైసిపి అధికారంలోకి రాగానే విజయసాయి రెడ్డికి ఎనలేని ప్రాధాన్యత దక్కింది. పార్టీలో నెంబర్ 2 గా ఉండేవారు. అయితే 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత విజయసాయిరెడ్డిలో క్రమేపి మార్పు ప్రారంభం అయింది. జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రాధాన్యత తగ్గింది. విజయసాయిరెడ్డి కంటే ఇతర నేతలకు ప్రాధాన్యం ఇచ్చేసరికి ఆయన మనస్థాపానికి గురయ్యారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు.
* కూటమిలో నో ఛాన్స్
విజయసాయిరెడ్డి లో రాజకీయ ఆసక్తి తగ్గలేదని తాజాగా తెలుస్తోంది. ఇప్పుడు మనసు మార్చుకుని పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని సమాచారం. ప్రధానంగా ఆయన బిజెపిలో చేరుతారని తెగ హడావిడి నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. బిజెపి నుంచి కూడా ప్రత్యేక పిలుపు రాలేదని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో చేరేందుకు అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబుతో పాటు లోకేష్ ను విజయసాయిరెడ్డి ఎంతగా టార్గెట్ చేసుకున్నారు క్యాడర్ కు తెలియంది కాదు. ఒకవేళ టిడిపి నాయకత్వం చేర్చుకోవాలని చూసినా క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు జనసేనలో చేరేందుకు ఆప్షన్ లేదు. అక్కడకు వెళితే సాధారణ నేతగానే ఉండాలి. అందుకే అటువైపు వెళ్ళరని తెలుస్తోంది.
* ఫైనల్ గా ఆ పార్టీలో
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సైతం విజయసాయిరెడ్డి విషయంలో ఆగ్రహంగా ఉంది. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మద్యం కేసు నమోదయింది. రాజ్ కసిరెడ్డి నుంచి మొన్నటి మిధున్ రెడ్డి వరకు విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం తోనే అరెస్టులు జరిగినట్లు ఒక ప్రచారం ఉంది. అందుకే ఆ పార్టీ చేర్చుకోదు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఒకసారి షర్మిలను కూడా కలిశారు విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరితే షర్మిల కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంది. ఫైనల్ గా విజయసాయిరెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్తారని తెలుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.