Vijayasai Reddy and Jagan: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీకి ఎప్పుడో గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న కోటరీని నమ్ముతున్నారని.. తనలాంటి వారికి విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఎన్నో సంచలనాలకు వేదికగా మారుతున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఆయన ఒక నిందితుడు. కానీ సాక్షిగా మారి ఈ కేసులో కీలక వివరాలు అందించినట్లు ప్రచారం నడిచింది. ఆయన నోరు తెరిచిన తరువాత ఈ కేసులో అరెస్టులు సైతం ప్రారంభం అయ్యాయి. అయితే ఇదే కేసులో కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. మరో మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి సమన్లు జారీ చేసింది.
కోటరీ పై టార్గెట్..
మరోసారి జగన్ చుట్టూ ఉన్న కోటరిని టార్గెట్ చేసుకున్నారు విజయసాయిరెడ్డి. ఎంతటి పెద్ద నాయకుడు అయినా.. బలవంతుడైన నాయకుడైనా.. చుట్టూ ఉన్న కోటరి అమ్ముడుపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెనుజువేలా అధ్యక్షుడి ఉదంతాన్ని గుర్తు చేశారు. చుట్టూ సైన్యం, సైన్యాధిపతులు ఉన్నా అమ్ముడు పోయారని.. చివరకు ఆయనతోపాటు భార్యను అమెరికా అరెస్టు చేయగలిగిందని చెప్పుకొచ్చారు. అమ్ముడుపోయిన కోటరిని నమ్ముకుంటే ఎంతటి పెద్ద నాయకుడైన బలహీనం కావాల్సిందేనని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. అయితే అది జగన్మోహన్ రెడ్డి కేనని అర్థమవుతోంది.
మళ్లీ వైసీపీలో చేరుతారని..
వాస్తవానికి విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) మళ్లీ జగన్మోహన్ రెడ్డి గూటికి చేరుతారని ప్రచారం నడిచింది. అందుకు తగ్గ ప్రయత్నాలు జరిగాయని కూడా టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. పైగా విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి అంతలా ఆసక్తి చూపడం లేదని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ నడిచింది. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడం వెనుక కోటరీ ఉందన్న అనుమానం ఉంది. ఇప్పటికే జగన్ చుట్టూ ఉన్న ఆ నలుగురితో విజయసాయిరెడ్డికి విభేదాలు వచ్చాయి. తనకంటే జగన్ దంపతులు వారికే ప్రాధాన్యం ఇవ్వడంపై విజయసాయిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. రాజ్యసభ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. తనను మళ్ళీ పిలుస్తారని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం స్పందించలేదని తెలుస్తోంది.
జగన్ పూర్తిగా విముఖత..
రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తగ్గించారు విజయసాయిరెడ్డి. అది ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలేదు. ఆపై మద్యం కుంభకోణం వివరాలు విజయసాయిరెడ్డి ఇచ్చారన్న ఆగ్రహం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ విజయసాయిరెడ్డిని చేరదీయకూడదని జగన్మోహన్ రెడ్డి గట్టి నిర్ణయానికి వచ్చినట్లు వైసిపి వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విస్తృతం చేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని జగన్ ఒక ఆలోచనకు వచ్చారు. ఇక తనను పట్టించుకోరని తెలిసి విజయసాయిరెడ్డి ఇలాంటి సంచలన ట్వీట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
