Vijaysai Reddy: విజయసాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారా? అయిష్టంగానే నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారా? ఆయన మనసు విశాఖపై ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరడంతో.. జగన్ కు విజయసాయిరెడ్డి అవసరం ఏర్పడింది. టిడిపి నుంచి పోటీ చేస్తున్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీకొట్టాలంటే విజయసాయిరెడ్డి కరెక్ట్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో జగన్ మాటకు కట్టుబడి విజయసాయి నెల్లూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అయితే తన మనస్సు ఎప్పుడు విశాఖ వైపు ఉంటుందని విజయసాయి సంకేతాలు ఇచ్చారు. వాల్తేరు క్లబ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో వైసిపి ఇరకాటంలో పడింది. అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మికి ఇబ్బందికరంగా మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులయ్యారు. విశాఖ కేంద్రంగా రాజకీయాలను నడిపారు. వైసిపి విజయాల్లో కీలక భూమిక పోషించారు. అయితే ఈ తరుణంలో ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు విజయసాయిరెడ్డి పెత్తనాన్ని సహించలేకపోయారు. అదే సమయంలో వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డి హవాను తగ్గించాలని చూశారు. అందుకే ఆయన ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యత నుంచి తప్పించేలా జగన్ పై ఒత్తిడి పెంచారు. దీంతో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తరువాత వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా నియమితులయ్యారు. కానీ విజయసాయిరెడ్డి మనుషులను పార్టీ నుంచి బయటకు పంపించేశారన్న ప్రచారం జరిగింది.
వాస్తవానికి విజయసాయిరెడ్డి విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. తన సొంత టీమును సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయితే విజయసాయిరెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వైసీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జగన్ విజయసాయిరెడ్డిని తప్పించారు. అయితే అక్కడ నుంచి కొద్ది రోజులు పాటు ఆయన సైలెంట్ అయ్యారు. పార్టీలో అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. అయితే ఉన్నపలంగా జగన్ మళ్ళీ విజయసాయి రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. కానీ తాను పోటీ చేయదలచుకున్న విశాఖ పార్లమెంట్ స్థానాన్ని వదులుకోవడాన్ని విజయసాయి జీర్ణించుకోలేకపోయారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లడంతో.. విజయసాయిరెడ్డిని నెల్లూరు బలవంతంగా పంపించారన్న ప్రచారం జరుగుతోంది. అక్కడ విజయసాయి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే తనను ఉత్తరాంధ్ర నుంచి పంపించడంలో బొత్స పాత్ర కూడా ఉంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మీ విశాఖ వైసిపి అభ్యర్థిగా ఉన్నారు. అందుకే తన మనుషుల ద్వారా విజయసాయిరెడ్డి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వాల్తేరు క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని విజయసాయిరెడ్డి చేసిన తాజా ప్రకటన.. వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. బొత్స ఝాన్సీ లక్ష్మి ని ఇరుకున పెట్టేందుకే ఈ తరహా ప్రకటన చేశారని బొత్స సత్యనారాయణ అనుమానిస్తున్నారు. విజయసాయిరెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రకటనను ఖండించారు. మొత్తానికి అయితే విజయసాయి రెడ్డి పార్టీలో తన ప్రత్యర్థులపై గట్టి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అయితే మున్ముందు ఈ పరిణామాలు ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి.