Vijayamma Shock For Jagan: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) రాజకీయంగా కలిసి రాలేదు. కుటుంబ పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. సరస్వతి పవర్ కంపెనీ వాటాల విషయంలో విజయమ్మ చేసిన బధలాయింపుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. విజయమ్మ జనార్దన్ రెడ్డి పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని రద్దుచేసి.. తిరిగి జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, క్లాసిక్ రియాల్టీ ల పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ జూలై 29న హైదరాబాద్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దానిపై విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా ఆ బదలాయింపును యథాస్థితిగా కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామం.
* రాజశేఖర్ రెడ్డి హయాంలో..
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్నాడులో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్( Saraswati power industries) కోసం జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకున్నారు. దీనిపై అప్పట్లోనే వివాదం చోటుచేసుకుంది. అయితే జగన్ ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. జగన్ షర్మిల వివాదంలోనూ సరస్వతి పవర్ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కంపెనీల కోసం తీసుకున్న ఆ భూమిలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో గత కొద్ది రోజులుగా దీనిపై వివాదం నడుస్తోంది. ఇంతలో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో సరస్వతి పవర్ అనేది తెరపైకి వచ్చింది. అది కుటుంబ ఆస్తి కావడంతో విజయమ్మ తన వాటాలను వేరే వ్యక్తులకు బదలాయించారు. అప్పటినుంచి వివాదం ప్రారంభం అయింది. పరిశ్రమలకు సంబంధించి లా ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తూ వచ్చారు. మరోవైపు ఆ భూముల్లో అటవీ శాఖకు చెందినవి అనుమానాలతో పవన్ కళ్యాణ్ సైతం పర్యటించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.
* అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు..
అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ( Sharmila) మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సమయంలో సరస్వతీ పవర్ భూముల వ్యవహారం ప్రతిసారి వివాదానికి దారితీస్తోంది. సరస్వతీ పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్నాయని అధికారులు నివేదిక ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దయింది. వేమవరం లో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ ను అధికారులు రద్దు చేయగలిగారు. అయితే వైయస్ కుటుంబ ఆస్తిగా భావిస్తున్న మిగులు భూములకు సంబంధించిన వివాదం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని సోదరి షర్మిల రాజకీయంగా విభేదిస్తున్నారు. ఆస్తిలో వాటాను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు విజయమ్మ. అందుకే షర్మిల సూచించిన వ్యక్తికి వాటాలు బదలాయించారని జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారు. లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. అయితే ఆ వాటాల బదలాయింపు అనేది యధాతధంగా కొనసాగించాలని ఆదేశాలు రావడం జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఈ ఆదేశాలు రావడం నిజంగా ఆయనకు ఇబ్బందికరమే.