Vijaya Sai Reddy advice Chandrababu: సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి లో( Vijaya Sai Reddy ) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. సుమారు 11 నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. రాజకీయాల జోలికి వెళ్ళడానికి కూడా తేల్చి చెప్పారు. అయితే రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక కీలక సూచన చేశారు. అది కూడా సోషల్ మీడియా వేదికగా. అయితే ఈసారి గతం కంటే భిన్నంగా స్పందిస్తున్నారు విజయసాయిరెడ్డి. వైసిపి ఓడిపోయిన తర్వాత ఆయనలో మార్పు ప్రారంభం అయింది. ఇప్పుడు కనిపిస్తోంది కూడా.
Also Read: చంద్రబాబుపై వ్యతిరేకత లేదు.. జగన్ పై సానుకూలత లేదు.. ఎందుకిలా!
అప్పట్లో దూకుడుగా..
వైయస్సార్ కాంగ్రెస్ లో( YSR Congress ) ఉన్నప్పుడు దూకుడుగా ఉండేవారు విజయసాయిరెడ్డి. పదునైన పురుష పదజాలంతో సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడేవారు. అందునా చంద్రబాబు అంటేనే అంత ఎత్తుకు ఎగిరి పడేవారు. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వంతో విభేదించి గుడ్ బై చెప్పారు. అయితే వైసీపీలో ఉన్నప్పుడు సోషల్ మీడియాకు పని చెప్పేవారు. కేంద్ర పెద్దలను ప్రశంసించడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులను తన మాటల తూటాలతో వెంటాడడం కూడా విజయసాయిరెడ్డికి అలవాటైన విద్య. కానీ ఈసారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పురుష పదజాలాన్ని వీడి సౌమ్యత వైపు అడుగులు వేశారు. ఇప్పుడు చంద్రబాబుకు సైతం కీలక సూచనలు చేశారు. అలా చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. అలా జరిగితే తాను ఎంతో సంతోషిస్తానని కూడా చెప్పారు.
ఇటీవల సైలెంట్..
ఇటీవల విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిపోతారని అంతా భావించారు. తనకు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో నమ్మకం ఉందని చెప్పిన ఆయన చుట్టూ ఉన్న కోటరిని తప్పుపట్టారు. ఆ కోటరి నాయకులు వల్లే తాను పార్టీకి గుడ్ బై చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక నేరుగా షర్మిలను కలిశారు. ఆమెతో కీలక చర్చలు జరిపారు. బిజెపి పెద్దలతో సైతం టచ్ లోకి వెళ్లారు. బిజెపిలోకి వెళ్ళిపోతారని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరకు మౌనం దాల్చడంతో తిరిగి వైసిపిలో చేరడానికి చర్చలు ప్రారంభించారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక సూచనలు చేయడంతో.. ఆయన తటస్థంగా ఉండిపోతారని ఒక అంచనాకు వస్తున్నారు విశ్లేషకులు.
Also Read: మళ్లీ ‘అమరావతి’ ఉద్యమం!
పెట్టుబడులపై కీలక సూచన..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో( Vishakha ) పెట్టుబడుల సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అనుకూల మీడియాలో సైతం దీనిపైన ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు కు ఒక కీలక సూచన చేశారు. ఈ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ముందుకొచ్చిన పరిశ్రమలకు.. వీలైనంత త్వరగా అనుమతులు, ఇతరత్రా పాలనాపరమైన అంశాల విషయంలో ఒక అధికారిని నియమించాలని కోరారు. అప్పుడే ఈ పనులన్నీ సులువు అవుతాయని చెప్పుకొచ్చారు. కనీసం ప్రభుత్వం చెబుతున్న దాంట్లో 75% పెట్టుబడులు వచ్చిన.. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. అదే జరిగితే ఏపీ దశ తిరిగినట్టేనని అభిప్రాయపడుతున్నారు. మరి విజయ సాయి రెడ్డి సలహాను సీఎం చంద్రబాబు స్వీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.